
మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాటం
ఖమ్మంమయూరిసెంటర్: బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో పెరిగిన మతోన్మాదానికి వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు పోరాడాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుగ్గవీటి సరళ పిలుపునిచ్చారు. ఐద్వా జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు శనివారం రెండో రోజుకు చేరగా, సుందరయ్య భవనంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వంద రోజుల్లో నిత్యావసరాల ధరలు తగ్గిస్తానని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, నల్లధనాన్ని వెలికి తీస్తానని ఇచ్చిన హామీలను బీజేపీ విస్మరించగా, మహిళలు, బాలికలపై దాడులు పెరిగాయని పేర్కొన్నారు. అంతేకాక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తోందని ఆరోపించారు. అలాగే, ఆదాయం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం, పబ్బులు, అసాంఘిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. ఇకనైనా మహిళా సాధికారితకు చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు మెరుగు రమణ, నాయకులు బండి పద్మ, ఎండీ మెహరున్నీసాబేగం, పి.నాగసులోచన, పి.ప్రభావతి, పి.సుమతి, శీలం కరుణ, కె.అమరావతి, జి.సునీత, జి.రజిత, బెల్లం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.