
గోదావరిలో మునిగి విద్యార్థి గల్లంతు
వేంసూరు: స్నేహితులతో కలిసి యాత్రకు వెళ్లిన విద్యార్థి గోదావరిలో మునిగి గల్లంతయ్యాడు. సత్తుపల్లిలోని మదర్‌థెరిస్సా కాలేజీలో ఇటీవల బీటెక్ పూర్తి చేసిన వేంసూరు మండలం లచ్చన్నగూడెంనకు చెందిన పామర్తి సాయిదినేశ్ స్నేహితులతో కలిసి ఏపీలో కోనసీమ జిల్లా వాడపల్లిలో వెంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం వెళ్లాడు. తొలుత ముగ్గురు స్నేహితులతో కలిసి అక్కడ గోదావరి స్నానానికి దిగగా దినేశ్ గల్లంతైనట్లు తెలిసింది. దీంతో రెస్క్యూ టీంలు గాలింపు చేపట్టినా సాయంత్రం వరకు ఆచూకీ లభించలేదు. ఈ మేరకు సమాచారం అందడంతో కుటుంబీకులు వాడపల్లి వెళ్లారు.
కడుపునొప్పి
తాళలేక ఆత్మహత్య
ఖమ్మంరూరల్: మండలంలోని గోళ్లపాడుకు చెందిన గజ్జల ఆంజనేయులు(49) కడుపునొప్పి భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ఇటీవల గుండెపోటు రాగా హైదరాబద్‌లో చికిత్స చేయించారు. అయినా ఆరోగ్యం కుదుట పడకపోగా ఈనెల 18న కడుపునొప్పి రావడంతో పురుగుల మందు తాగాడు. దీంతో ఆంజనేయులును ఖమ్మం తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఆయన భార్య కనకమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సీఐ ముష్క రాజు తెలిపారు.
సీజ్ చేసిన ఇసుక డంప్ మాయం
తిరుమలాయపాలెం: మండలంలోని ముజాహిదిపురం శివార్లలో అక్రమంగా నిల్వ చేసిన 30 ట్రిప్పుల ఇసుక డంప్‌ను ఇటీవల రెవెన్యూ, పోలీస్ అధికారులు సీజ్ చేయగా.. శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం ధరావత్‌తండాకు చెందిన ధరావత్ రమేశ్, ధరావత్ రవీందర్ 30 ట్రిప్పుల ఇసుకను అక్రమంగా నిల్వ చేసినట్లు తేలడంతో ఈ నెల 15న సీజ్ చేశారు. ఈ ఇసుకను శనివారం వేలం వేయనున్నట్లు తహసీల్దార్ విల్సన్ ప్రకటన విడుదల చేశారు. కానీ శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అందులో 25 ట్రిప్పుల మేర ఇసుకను ఎత్తుకెళ్లారు. శనివారం ఉదయం వేలం పాటకు సిద్ధమైన అధికారులు ఇసుక లేకపోవడంతో అవాక్కయ్యారు. దీంతో తహసీల్దార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆ సీఐ వ్యవహారంపై విచారణ
ఖమ్మంక్రైం: ఖమ్మంలో శుక్రవారం మాజీ మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీఆర్‌బీ సీఐ హడావుడి చేసిన అంశంపై పత్రికల్లో కథనాలు రావడం పోలీస్ శాఖలో చర్చకు దారి తీసింది. సదరు సీఐ వ్యవహారశైలిపై శాఖాపరంగా విచారణ మొదలుపెట్టినట్లు తెలిసింది. ఆయన తీరుపై నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. ఈమేరకు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ, ఖమ్మం పోలీస్ కమిషనర్ వేర్వేరుగా నివేదికలు ఇవ్వగా, సీఐకి భద్రాద్రి ఎస్పీ మెమో జారీ చేసినట్లు తెలిసింది.