
లక్ష్యంతో చదివితే ఉన్నత స్థాయికి..
ముదిగొండ: విద్యార్థులంతా స్పష్టమైన లక్ష్యాలను ఏర్పర్చుకుని శ్రద్ధగా చదివితే ఉన్నత స్థాయికి ఎదగొచ్చని శాతవాహన యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ పొఫెసర్ కడారు వీరారెడ్డి తెలిపారు. ముదిగొండ మండలం బాణాపురంలో శనివారం జరిగిన ఆవుల అమ్మిరెడ్డి ఫౌండేషన్ తరఫున స్కాలర్‌షిప్ పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారి ఆవుల భాస్కర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వీరారెడ్డి మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నందున నాణ్యమైన విద్య అందుతోందని తెలిపారు. వసతులను సద్వినియోగం చేసుకుంటూ కమశిక్షణతో చదివితే ఎంచుకున్న రంగంలో అభివృద్ధి సాధించొచ్చని చెప్పారు. కాగా, ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించేలా ఆవుల అమ్మిరెడ్డి పేరిట స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం అభినందనీయమని చెప్పారు. ఈ సందర్భంగా ముదిగొండ మండలంలోని 15 ఉన్నత పాఠశాలల్లో పదో తరగతిలో ప్రతిభ చూపిన 89 మందికి రూ.10 వేల చొప్పున స్కాలర్‌షిప్ అందజేశారు. ఫౌండేషన్ చైర్మన్ ఆవుల భాస్కర్‌రెడ్డి, భరత్‌రెడ్డి, తహసీల్దార్ సునీత ఎలిజబెత్, కమిటీ సభ్యులు వట్టికూటి వెంకటేశ్వర్లు, పూర్ణచందర్‌రావు, రామారావు, బాణాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం ఈ.వెంకట్రామిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మాజీ వీసీ వీరారెడ్డి, రిటైర్డ్ ఐఆర్‌ఎస్ భాస్కర్‌రెడ్డి