
ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి
బోనకల్: ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత సూచించారు. బోనకల్ మండలం రాపల్లిలో పరుచూరి సుజాతకు ఇల్లు మంజూరు కాగా, స్థలవిషయమై వివాదం తలెత్తడంతో గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన డీపీఓ వివాదం ఉన్న స్థలంలో కాకుండా సొంత స్థలంలోనే ఇల్లు నిర్మించుకోవాలని సూచించారు. మిగతా లబ్ధిదారులు కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్మాణాలు చేపడితే బిల్లులు మంజూరవుతాయని తెలిపారు. కాగా, పంచాయతీ కార్యదర్శి వెంకటరమణ అందుబాటులో ఉండడం లేదని, ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి డబ్బు అడగడమే కాక జీపీ ట్రాక్టర్‌ను ప్రైవేట్ పనులకు వినియోగిస్తున్నట్లు స్థానికులు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టాలని ఎంపీఓ శాస్త్రికి సూచించారు. అనంతరం గ్రామంలో పారిశుద్ధ్య పనులను డీపీఓ పరిశీలించారు.