
తప్పులు సరిచేసుకోకపోతే కాంగ్రెస్‌కు అధోగతే
కొణిజర్ల: జైళ్లలో ఉండాల్సిన వారు అసెంబ్లీ, పార్లమెంట్‌లో ఉంటుండగా.. చట్టసభల్లో ఉండాల్సిన మేధావులు రోడ్డుపై ఉంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. కొణిజర్ల మండలం మండలం తనికెళ్లలో సోమవారం నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ను మోయడమే తమ పని కాదని కూనంనేని వెల్లడించారు. బీఆర్‌ఎస్ ప్రజా వ్యతిరేక విధానాల వల్లే కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చామని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా కూడా ఇందిరమ్మ ఇల్లు, తదితర అంశాల్లో పేదలను విస్మరిస్తోందని ఆరోపించారు. ఇకనైనా పార్టీ తీరు మార్చుకోకపోతే అధోగతి ఎదురవుతుందని తెలిపారు. కాగా, బీజేపీకి మతం తప్ప వేరే సిద్ధాంతం లేకపోవడంతో, హిందూ మతం, రాముడిని అడ్డం పెట్టుకుని ఓట్ల రాజకీయం చేస్తోందని కూనంనేని ఆరోపించారు. పేదలకు సాయం చేయకపోగా మతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుతున్నారని పేర్కొన్నారు. అంతేకాక ఆపరేషన్ కగార్ పేరుతో ఉద్యమకారులను పొట్టన బెట్టుకుంటున్నారని తెలిపారు. సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు మాట్లాడుతూ డిసెంబర్ 26న సీపీఐ శత జయంతి ఉత్సవాలను లక్ష మంది కార్యకర్తలతో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి దండిసురేష్, నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, యర్రా బాబు, దొండపాటి రమేష్, తాటివెంకటేశ్వర్లు, కొండపర్తి గోవిందరా వు, స్వర్ణ రమేష్, కంపసాటి వెంకన్న, యాసా వెంకటేశ్వరరావు, తాటి నిర్మల, తమ్మిశెట్టి వెంకటేశ్వ ర్లు, పీవీరావు, వేములకొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని