
బౌద్ధక్షేత్రంలో పాముల భయం
నేలకొండపల్లి: దక్షిణ భారతదేశంలో కెల్లా అతిపెద్దదైన మండల కేంద్రంలోని బౌద్ధక్షేత్రంను తిలకించేందుకు సోమవారం పలువురు పర్యాటకులు రాగా పాములు కనిపించగడంతో పరుగులు తీశా రు. క్షేత్రంపై నిర్వహణపై అధికారుల పట్టింపు కరువై ఆవరణ అంతా పిచ్చిచెట్లు పెరిగాయి. దీంతో ఫొటోషూట్ కోసం వచ్చిన ఇద్దరితో పాటు పలువురు పర్యాటకులకు పాలములు కనిపించడంతో ఆందోళనగా పరుగులు పెట్టారు. దీంతో అక్కడి సిబ్బంది అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ డానియేల్ కు సమాచారం ఇవ్వగా ఆయన ఖమ్మం నుంచి పాములు పట్టే వారిని పిలిపించడంతో వారు స్టోర్ రూమ్‌లో రెండు పాములను బంధించారు. అధికారులు ఇకనైనా బౌద్ధక్షేత్రం పరిసరాలను శుభ్రం చేయించాలని పలువురు కోరుతున్నారు.
పోర్చుగల్‌లో
ఉపాధి అవకాశాలు
ఖమ్మం రాపర్తినగర్: పోర్చుగల్‌లో ఉపాధి అవకాశాలు ఉన్నందున ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి ఎన్.మాధవి సూచించారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్(టామ్ కామ్) ద్వారా పోర్చుగల్‌లో హోటల్ మేనేజ్‌మెంట్, హౌస్ కీపర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, స్పా థెరపీ, ఈవెంట్ కోఆర్డినేటర్లుగా అర్హులను ఎంపిక చేస్తారని తెలిపారు. 21–40 ఏళ్ల లోపు వయస్సు, ఎంపిక చేసుకున్న రంగంలో సరైన విద్యార్హత, ఐదేళ్ల అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఆసక్తి, అర్హత గల వారు దరఖాస్తు వివరాల కోసం 94400 52592, 94400 49937, 94400 51452 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
‘దోచుకోవడానికే
పని గంటల పెంపు’
ఖమ్మంమయూరిసెంటర్: కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే లేబర్ చట్టాలను కోడ్ల పేరిట కుదించి కార్మిక హక్కులపై దాడి చేస్తోందని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పేర్కొన్నారు. దీనికి తోడు పని గంట లు పెంచడం మేడే పోరాట ఫలాన్ని పాతి పెట్ట డమేనని తెలిపారు. కార్పొరేట్ వర్గాలు, పెట్టుబడిదారుల లాభాల కోసం వేతన జీవుల శ్రమను అదనంగా దోచుకోవడానికి ఈ విధానాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు. బీజేపీ బాటలో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు పయనిస్తున్నాయని విమర్శించారు. ఇకనైనా పని గంటల పెంపు జీఓను వెనక్కు తీసుకోవాలని రంగారావు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఏదులాపురం సొసైటీకి పర్సన్ ఇన్‌చార్జ్
ఖమ్మంరూరల్: మండలంలోని ఏదులాపురం ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘానికి పర్సన్ ఇన్‌చార్జ్‌ను నియమించాలని సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సొసైటీ చైర్మన్ కొందరు రైతుల పేరిట రుణాలు తీసుకున్నారని, ఆ రుణాలు చెల్లించా లంటూ తమకు నోటీసులు వస్తున్నాయని పలువురు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ‘సాక్షి’లో వరుస కథనాలు వచ్చిన విషయం విదిత మే. కాగా, రైతుల ఫిర్యాదుతో జిల్లా సహకార శాఖాధికారి విచారణకు ఆదేశించగా సొసైటీల అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉషశ్రీ ఇరువర్గాలను విచా రించారు. ఆపై తుది నివేదికను రాష్ట్ర సహకారశాఖ ఉన్నతాఽధికారులకు సమర్పించారు. దీంతో నాలుగు నెలలు పాటు లేదా సొసైటీ ఎన్నికలు నిర్వహించే వరకు పర్సన్ ఇన్‌చార్జ్‌ను నియమించాలని జిల్లా సహకార శాఖ అధికారిని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
మోటాపురంలో చోరీ
నేలకొండపల్లి: మండలంలోని మోటాపురంలో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన చావా శేఖర్‌రావు కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి ఇంటికి తాళం వేసి ఖమ్మం వెళ్లారు. దీంతో అర్ధరాత్రి వచ్చిన దుండుగులు ఇంటి తలుపులు, ఆపై బీరువాను ధ్వంసం చేశారు. బీరువాలో ఉన్న రూ.50 వేల నగదు, దాదాపు రెండు తులాల బంగారం, అరకేజీ వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. ఈ విషయమై సోమవారం అందిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ ప్రారంభించారు.
రామయ్య భూముల్లో
అక్రమంగా నిర్మాణం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థాన భూముల ఆక్రమ కొనసాగుతోంది. పట్టణ సరిహద్దులోని ఏపీ పురుషోత్తపట్నంలో ఉన్న ఆలయ భూముల్లో కొందరు ఆక్రమణదారులు సోమవారం ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఆలయ ఉద్యోగులు వెళ్లి అడ్డుకోవడంతో స్వల్ప ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఏఈఓ భవాని రామకృష్ణ మాట్లాడుతూ ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు 889.50 ఎకరాల భూములను దేవస్థానానికి అప్పగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.