
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంవన్‌టౌన్/నేలకొండపల్లి/తల్లాడ: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. నేలకొండపల్లి మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం కార్పొరేషన్, తల్లాడ మండలాల్లో జరిగే పలు కార్యక్రమాలకు హాజరవుతారు. ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో కలిసి పర్యటించనున్న మంత్రి తల్లాడ పర్యటనలో భాగంగా పినపాకలో రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే, మిట్టపల్లిలో గ్యాస్ లీకేజీతో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగే కార్యక్రమాల్లోనూ మంత్రి పాల్గొననున్నారు.
పార్టీ సంస్థాగత నిర్మాణానికి పాటుపడదాం
ఖమ్మంమామిళ్లగూడెం: జిల్లాలో భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణానికి కార్యకర్తలు సైనికుల్లా కృషి చేయాలని పార్టీ జిల్లా సంఘటన సంరచన ప్రభారీ పొనుగోడు పాపారావు పిలుపునిచ్చారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో శనివారం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బీజేపీ నేతృత్వాన కొనసాగుతున్న ఫ్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తోందని తెలిపారు. దేశ భద్రత, పౌరుల రక్షణే ధ్యేయంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టిందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీని ఆదర్శంగా తీసుకుని పార్టీ పటిష్టతకు కార్యకర్తలు కృషి చేయాలని, తద్వారా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. సమావేశంలో నాయకులు ఈవీ రమేశ్, సన్నే ఉదయ్‌ప్రతాప్, అల్లిక అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
వన విజ్ఞాన్ క్యాంప్‌లో బాలికలు
ఖమ్మంఅర్బన్: వేసవి సెలవుల నేపథ్యాన అటవీ శాఖ ఆధ్వర్యంలో ఖమ్మంలోని వెలుగుమట్ల అర్బన్ పార్క్‌లో 6 – 15 ఏళ్ల బాలబాలికల కోసం ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నారు. జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్‌సింగ్ నేతృత్వాన కొనసాగుతున్న ఈ శిబిరాన్ని బాలల సదనం బాలికలు సందర్శించారు. ఈ సందర్భంగా పార్క్‌లోని వృక్షాలు, పక్షులపై అవగాహన కల్పించగా.. మొక్కల పెంపకం, కొబ్బరిబొండాల్లో తులసి మొక్కలు పెంచే విధానాన్ని సిబ్బంది వివరించారు. మొదటి విడత శిబిరం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు ఉచితంగా నిర్వహించగా, వచ్చే వారం మొదలయ్యే శిబిరానికి పిల్లలు ముందుగా నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఎఫ్‌డీఓ మంజుల, ఎఫ్‌ఆర్‌ఓ జి.నాగేశ్వరరావు, ఎఫ్‌ఎస్‌ఓ రమేశ్, ఎఫ్‌బీఓలు జ్యోతి, నాగమణి, కవిత, ఖాజాబీ, ఎఫ్‌ఎస్‌ఓ కవిత పాల్గొన్నారు.
మంటలు అంటుకుని
వృద్ధురాలు మృతి
సత్తుపల్లి: వరిగడ్డికి అంటుకున్న మంటలు ఎగిసిపడి ఓ వృద్ధురాలికి అంటుకుని మృతి చెందింది. మండలంలోని తుంబూరు గ్రామానికి చెందిన ఓరుగంటి నాగేశ్వరమ్మ(74) తన వరిపొలంలో శనివారం గడ్డి తొలగించినిప్పుపెట్టింది. అంతలోనే ఎండ తీవ్రతతోఆమె అస్వస్థతకు గురై పడిపోయింది. దీతో మంటలు ఎగిసిపడుతూ వచ్చి నాగేశ్వరమ్మకు అంటుకొని కాలిపోతుండగా గుర్తించిన సమీప రైతులు కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. అంతా చేరుకుని మంటలుఆర్పేలోగా ఆమె మృతి చెందింది. మృతదేహాన్ని సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేశారు.

నేడు మంత్రి పొంగులేటి పర్యటన