సాయుధ పోరాటం భావితరాలకు ఆదర్శం
తిమలాయపాలెం/నేలకొండపల్లి/ముదిగొండ/ బోనకల్/: నైజాం రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భావితరాలకు ఆదర్శమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాగం హేమంతరావు అన్నారు. తిరుమలాయపా లెం మండలం కొక్కిరేణి, నేలకొండపల్లి, ముదిగొండ మండలం గోకినేపల్లి బోనకల్ మండలం గోవిందాపురం(ఎల్)లో సాయుధ పోరాట అమరుల స్తూపాల వద్ద హేమంతరావు, నాయకులు శనివారం నివాళులర్పించి మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉవ్వెత్తున జరిగిందని తెలిపారు. రజాకార్లకు వ్యతిరేకంగా ఆయుధాలు పట్టి పోరాడిన చరిత్ర ఇక్కడి యోధులకు ఉందని చెప్పారు. నాడు ప్రతీ పల్లెలో రజాకార్లు భూస్వాములకు కొమ్ముకాసి పేదలను చిత్రహింసలకు గురిచేశారని తెలిపారు. ఎందరో పోరాట యోధులు రజాకార్లను వ్యతిరేకించి ప్రాణాలు కోల్పోయారని.. వారికి గుర్తుగా స్తూపాలు నిలుస్తున్నాయని పేర్కొన్నారు. కాగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సాయుధ తెలంగాణ పోరాట చరిత్రను వక్రీకరిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యాన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నేటి తరానికి తేలిపేందుకే వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, నాయకులు మహమ్మద్ మౌలానా, దంతాల బాలరాజు, రాధాకృష్ణ, రామ్మూర్తినాయక్, ఇంటూరి వెంకటేశ్వరరావు, జమ్ముల జితేందర్‌రెడ్డి, యర్రా బాబు, లతాదేవి, పోటు కళావతి, కర్నాటి భానుప్రసాద్, రావులపాటి శ్రీనివాసరావు, పయ్యావుల లింగయ్య, షేక్ మౌలాలి, జక్కుల రామారావు, సీపీఎం నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, చింతలచెరువు కోటేశ్వరరావు, దొండపాడు నాగేశ్వరరావు పాల్గొన్నారు.


