
సాక్షిప్రతినిధి, ఖమ్మం: అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని ఆ నేతల చుట్టే తిరుగుతున్నాయి. ప్రచారం నుంచి నేతలు, కార్యకర్తల సమన్వయం, చేరికలు, వ్యూహాల రూపకల్పన తదితర అంశాల్లో వీరే ప్రధాన భూమిక పోషిస్తున్నారు. బీఆర్‌ఎస్‌లో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీలు నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు తాతా మధుసూదన్, కాంగ్రెస్‌లో సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కోచైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఈ వ్యవహారాలను చక్కబెడుతున్నారు.
పావులు కదుపుతున్న బీఆర్‌ఎస్
రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ బీఆర్‌ఎస్ తరఫున ఖమ్మం నుంచి బరిలో ఉండగా.. తన నియోజకవర్గంతోపాటు ఇతర చోట్ల కూడా అక్కడి నేతలతో సమన్వయం చేసుకుంటున్నారు. అలాగే, ఎంపీలు నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు అన్ని స్థానాల్లో అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహ, ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. మంత్రి పువ్వాడకు మధిర నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించగా ఆయన దృష్టి సారించారు. ఇక ఎంపీ వద్దిరాజు రవిచంద్ర చొరవతో బీఆర్‌ఎస్‌లోకి మాజీ మంత్రి సంభాని సహా పలువురి చేరికలు జోరందుకోగా, ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌గా ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరోపక్క బీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రచారం, వ్యూహాల రూపకల్పనలో ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు చురుగ్గా వ్యవహరిస్తూ కార్యకర్తలను కార్యోన్ముఖులను చేస్తున్నారు.
దీటుగా కాంగ్రెస్ సమన్వయం
సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, కాంగ్రెస్ ప్రచార కమిటీ కోచైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సమన్వయం చేస్తున్నారు. భట్టి తన నియోజకవర్గం మధిరతోపాటు ఇతర నియోజకవర్గాల ప్రచారంలోనూ పాల్గొంటున్నారు. ఇక పొంగులేటి పాలేరులో ప్రచారం చేస్తూనే కొత్తగూడెం తదితర ప్రాంతాలకు హాజరవుతున్నారు. భట్టి, పొంగులేటి, తుమ్మల ఉమ్మడి జిల్లాను ప్రభావితం చేయదగిన నేతలు కావడంతో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల సభలు, రోడ్ షోలు జరగనుండగా ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఇక మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అటు భద్రాచలం, ఇటు ఖమ్మంపై దృష్టి సారించి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.
ఎవరి ప్రతిష్ట పెరిగేనో..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఈ నేపథ్యాన కీలక నేతలు ఇతర పార్టీల నేతలను చేరుకోవడమే కాక ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకోవడంలో నిమగ్నమయ్యారు. గతంలో కన్నా భిన్నంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అటు బీఆర్‌ఎస్, ఇటు కాంగ్రెస్ నేతలు అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం సర్వశక్తులొడ్డుతున్నారు. ఇందుకోసం తమ నియోజకవర్గాల్లోనే కాకుండా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అభ్యర్థుల ప్రచారానికి హాజరవుతున్నారు. అయితే ఓటర్లను ఆకట్టుకోవడంలో వీరిలో ఎవరు సఫలమవుతారో ఫలితాలు వచ్చాక తేలిపోనుంది.