సాక్షి, బళ్లారి: వేసవి సెలవులు ముగిశాయి. 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో బడి గంట మోగింది. వేసవి సెలవులను ఎంజాయ్ చేసిన విద్యార్థులు తొలిరోజు ఉత్సాహంగా పాఠశాలలకు వచ్చారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 720 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది పాఠశాలల్లో స్వాగత తోరణాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికారు. మొదటి రోజు కావడంతో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను వెంటబెట్టుకుని వచ్చి పాఠశాలల్లో వదిలివెళ్లారు. ఈ విద్యా సంవత్సరంలో ఆయా పాఠశాలలకు ప్రభుత్వం సరఫరా చేసిన పాఠ్య పుస్తకాలను తొలిరోజు దాదాపు 80 శాతం పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.
పిల్లలను బడికి పంపించాలి
హొసపేటె: నగరంలోని చిత్తవాడిగి ప్రభుత్వ వినోభవ పాఠశాలలో సోమవారం పాఠశాల ప్రారంభోత్సవం, ప్రవేశాల కార్యక్రమాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. జిల్లా డీడీపీఐ వెంకటేష్ రామచంద్ర, హోస్పేట్ తాలూకా క్షేత్ర విద్యాధికారి బీ.ఉమాపతి బీఆర్‌సీ శివకుమార్, ఈసీఓలు అబ్దుల్ కలాం, రాజు, ఎస్‌డీఎంసీ అధ్యక్షుడు బాబు, ప్రధానోపాధ్యాయుడు బసవరాజ్ తదితరులు పిల్లలను పాఠశాలలోకి సాదరంగా ఆహ్వానించారు. అంతకుముందు ఉపాధ్యాయులు, ఎస్.డీ.ఎం.సీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రుల భాగస్వామ్యంతో పాఠశాల గది, ప్రాంగణాన్ని శుభ్రం చేసి పూలమాలలు, బెలూన్లతో అలంకరించారు. విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం డీడీపీఐ వెంకటేష్ రామచంద్ర మాట్లాడుతూ.. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, మంచి నాణ్యమైన బూట్లు, సాక్సులు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ద్విభాషా బోధనను ప్రారంభించినట్లు చెప్పారు.
పాఠశాలకు రండి..
రాయచూరు రూరల్: జిల్లా వ్యాప్తంగా సోమవారం బడులు పునః ప్రారంభమయ్యాయి. నగరంలోని బాలికల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, రాయచూరు తాలుకా దుగనూరు, శ్రీరామనగర క్యాంప్ పాఠశాల విద్యార్థులతో కలసి పిల్లలను బడిలో చేర్పించాలని అవగాహన ర్యాలీ నిర్వహించారు. 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయని జిల్లా అధికారి పూవిత, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కాందూ వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పిల్లలు పొలం పనులు మానేసి బడికి వచ్చి చదువుకోవాలని సూచించారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా పుస్తకాలు, యూనిఫాం, ఇతర సౌలభ్యాలు కల్పించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. జిల్లాలో 30 చోట్ల కర్ణాటక పబ్లిక్ పాఠశాలలు ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున, తాలూకా విద్యాశాఖ అధికారి ఈరణ్ణ కోస్గి, పాఠశాల హెడ్ మాస్టార్ కుంటప్ప గౌరీష్, వక్రాణి, శ్రీనివాస్, లలిత, మహంతేష బిరదార్ పాల్గొన్నారు.
విద్యార్థులను బడిలోకి ఆహ్వానిస్తున్న ఉపాధ్యాయులు
బళ్లారిలో విద్యార్థులను బడికి పంపాలని కోరుతూ ర్యాలీ చేపట్టిన దృశ్యం
తెరచుకున్న పాఠశాలలు
ఉత్సాహంగా
బడిబాట పట్టిన విద్యార్థులు
స్వాగత తోరణాలు కట్టి
ఆహ్వానించిన ఉపాధ్యాయులు


