రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత | - | Sakshi
Sakshi News home page

రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత

May 29 2026 2:55 AM | Updated on May 29 2026 2:55 AM

రాయచూరు రూరల్‌: రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించాలని యాదగిరి జిల్లా గురుమఠకల్‌ శాసన సభ్యుడు కందకూరు శరణేగౌడ పేర్కొన్నారు. గురువారం గురుమఠకల్‌ తాలూకాలో వివిధ ప్రధాన రహదారుల నిర్మాణానికి భూమిపూజ చేసి మాట్లాడారు. నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. రూ.50 కోట్లతో గురుమఠకల్‌– హైదరాబాద్‌ రహదారి, తాండాలు, చెన్నసూర్‌ రహదారి పనులు, విద్యుత్‌ దీపాల అమరిక వంటి పనులు చేయాలన్నారు. ఈ సందర్భంగా అధికారులు చెన్నమల్లప్ప ఘంటి, అమరేష్‌ పాటిల్‌, శరణప్ప, పరశురాం, దౌలత్‌, పార్టీ నాయకులు సుభాష్‌చంద్ర, రామణ్ణ, సిద్దరామరెడ్డి, శరణు అవంతి, రవిలున్నారు.

ఓటరు జాబితాలను

సవరించరూ

రాయచూరు రూరల్‌: ప్రత్యేక సవరణ ప్రక్రియ(సర్‌) ద్వారా ఓటరు జాబితా సవరణకు చర్యలు చేపట్టాలని సీపీఐ(ఎంఎల్‌) డిమాండ్‌ చేసింది. గురువారం రాయచూరు రూరల్‌ శాసన సభ్యుడి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు నాగరాజ్‌ పూజార్‌ మాట్లాడారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా, అశాసీ్త్రయంగా చేపడుతున్న విధానాలను తిరస్కరించాలన్నారు. ఎన్డీయే సర్కార్‌ ఎన్నికల కమిషన్‌ను దుర్వినియోగ పరుచుకుంటోందన్నారు. బిహార్‌, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఓటరు జాబితాల నుంచి లక్షలాది మంది ఓటర్ల పేర్లను ఏకపక్షంగా తొలగించారని గుర్తు చేశారు. దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో గళమెత్తాలని కోరుతూ ఎమ్మెల్యే బసనగౌడకు వినతిపత్రం సమర్పించారు.

వైద్య శిబిరాల లబ్ధి పొందాలి

రాయచూరు రూరల్‌: పేద ప్రజలు ఉచిత వైద్య శిబిరాలు వినియోగించుకోవాలని గంగావతి తాలూకా హొసకేర డగ్గి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఫర్జాన హస్మిన్‌ పేర్కొన్నారు. ఎంఎం జోషి నేత్రాలయ కనకగిరి, స్వామి వివేకానంద యువక మండలి ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆరోగ్య పరీక్ష శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఆహారంలో కాయగూరలు, పప్పుదినుసులను తీసుకోవాలని సలహాలిచ్చారు. ఈ సందర్భంగా గారపాటి రామకృష్ణ, వెంకటేష్‌, అంజలి, సువర్ణ, శరణప్ప, భాగ్యలక్ష్మి, దొడ్డబసమ్మ, శేఖమ్మ, శారద, శకుంతల, దురుగమ్మ, మంజునాథ్‌లున్నారు.

దళిత పేదలకు అన్యాయం

రాయచూరు రూరల్‌: భూమి లేని దళిత పేదలకు భూములు ఇప్పిస్తామని అన్యాయం చేశారని బాధితులు ఆరోపించారు. గురువారం విలేకరుల సమావేశంలో మారెప్ప మాట్లాడారు. మాన్వి తాలూకా సంగాపురలో 20 మంది పేదలతో అంబేడ్కర్‌ అభివృద్ధి మండలి నుంచి ఎకరా భూమిని మంజూరు చేయిస్తామని రాయచూరుకు చెందిన నరిసింహులు భండారి మోసం చేశాడన్నారు. సంగాపుర వద్ద ప్రధాన రహదారి పక్కనే 20 ఎకరాలున్న భూమిని చూపించి లబ్ధిదారుల నుంచి రూ.లక్ష తీసుకున్నారన్నారు. ఈ విషయంలో రెండేళ్ల నుంచి అడుగుతున్నా అధికారులపై అసత్యపు ఆరోపణలు చేయడంతో అనుమానం రాగా పరిశీలించడంతో డబ్బులు దిగమింగినట్లు తెలిసిందన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లాధికారికి ఫిర్యాదు చేశామన్నారు.

వాట్సప్‌ నకిలీ అకౌంట్‌తో డబ్బులు డిమాండ్‌

హుబ్లీ: జిల్లాధికారిణి ఆర్‌.స్నేహల్‌ వాట్సప్‌ నకిలీ అకౌంట్‌ను సృష్టించిన దుండగులు డబ్బులను డిమాండ్‌ చేసిన ఉదంతం వెలుగు చూసింది. వేరే నెంబర్‌కు జిల్లాధికారిణి డీపీ ఫొటో పెట్టిన కేటుగాళ్లు వాట్సప్‌ ద్వారా మెసేజ్‌ పంపి డబ్బులను డిమాండ్‌ చేస్తున్నారన్న విషయాన్ని తెలుసుకొన్న జిల్లాధికారిణి నగర సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరూ కూడా ఇలాంటి సందేశాలకు స్పందించరాదని తన వాట్సప్‌ స్టేటస్‌లో పోస్టు పెట్టి ఆమె విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement