హొసపేటె: సనాతన ధర్మంపై తమిళనాడు డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ హిందూ సనాతన సంరక్షణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో భారీ నిరసన ప్రదర్శన, కాగడాల ఊరేగింపు చేపట్టారు. నగరంలోని వడకరాయ స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన నిరసన, కాగడాల ఊరేగింపు మెయిన్‌బజార్, పాదగట్టి ఆంజనేయస్వామి ఆలయం, మెయిన్ మసీదు, గాంధీ చౌక్, మూరంగడి సర్కిల్, పుణ్యమూర్తి సర్కిల్, సెంట్రల్ బస్టాండ్, మోడరన్ సర్కిల్ మీదుగా సాగి చివరకు డాక్టర్ పునీత్ రాజ్‌కుమార్ సర్కిల్ వద్ద బహిరంగ సభగా మారింది. సభలో డాక్టర్ రాహుల్ దేవరాజ్ మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని నాశనం చేస్తామని దురుద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఆయనను ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో చింతామణి మఠం స్వామీజీ, పూర్ణానంద భారతీ స్వామీజీ, సమితి గౌరవాధ్యక్షుడు అశోక్ జీ, కో–ఆర్డినేటర్ ఎన్.రేవణ సిద్దప్ప, కో–కన్వీనర్ అప్పారావు, మున్సిపల్ అధ్యక్షుడు రూపేష్ కుమార్, సభ్యుడు ఆనంద్, వివిధ సంఘాల నాయకులు దేవరమనె శ్రీనివాస్, సందీప్‌సింగ్, సిద్ధార్థ సింగ్, ఎం.సీ.వీరాస్వామి, భూపాల్ ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు.


