మనోహరం.. మల్లె కరగ | - | Sakshi
Sakshi News home page

మనోహరం.. మల్లె కరగ

Apr 29 2026 8:00 AM | Updated on Apr 29 2026 8:00 AM

బొమ్మనహళ్లి: బెంగళూరు వద్ద ఆనేకల్‌ తాలూకాలో ముత్సంద్ర గ్రామంలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ కరగ వేడుక కమనీయంగా జరిగింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఊర హబ్బ పేరిట గ్రామ దేవతల పల్లకీ ఉత్సవం జరిగింది. గ్రామ దేవతల ఉత్సవ విగ్రహాలను పూల పల్లకీలలో ఊరేగించారు. మహిళలు దీపాలను మోస్తూ నడిచారు. వీర కుమారుల ఖడ్గ సేవ మధ్య కరగ పూజారి మల్లెపూల కరగనెత్తుకుని గ్రామంలో నాట్యమాడుతూ సంచరించారు.

ఘనంగా

బందంతమ్మన పండుగ

మండ్య: మండ్య నగరంలోని హొసహళ్లి, రామనహళ్లి గ్రామాల్లో పెద్దలు, గ్రామస్తుల నేతృత్వంలో ఘనంగా బందంతమ్మన పండుగను ఆచరించారు. గ్రామ ప్రముఖుడు హెచ్‌సీ శివలింగేగౌడ మాట్లాడుతూ తమ తాత, ముత్తాతల కాలం నుంచి ఈ బందంతమ్మన పండుగను తాము సాంప్రదాయబద్ధంగా ఆచరిస్తున్నామన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు సోకే వ్యాధులు అమ్మవారి కృపతో దూరం కావాలని, గ్రామానికి మంచి జరగాలన్నది తమ నమ్మకమన్నారు. అమ్మవారి విగ్రహాన్ని హొసహళ్లి గ్రామ సరిహద్దుల నుంచి గ్రామ ప్రధాన వీధుల గుండా ఊరేగించి అన్నదానం చేశారు.

రాష్ట్ర ఖజానా ఖాళీ: కుమార

కోలారు: బీజేపీ– జేడీఎస్‌ మైత్రిలో ఎలాంటి సమస్య లేదని, అంతా సజావుగా సాగుతోందని కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి తెలిపారు. మాలూరులో జేడీఎస్‌ నాయకుడు రామేగౌడ నివాసంలో జరిగిన శుభకార్యానికి హాజరై విలేకరులతో మాట్లాడారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నా పరిష్కరించుకుంటామని తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి కుర్చీ కోసం పోటీ నడుస్తోంది. 5 రాష్ట్రాల ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి మార్పు జరుగుతుందని అంటున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలన్నారు. కాంగ్రెస్‌ పరిపాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు, గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సమస్య పరిష్కారానికి కూడా నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌ కూడా ఎన్నికల నిర్వహణకు డబ్బులు లేవని కోర్టుకు వెళ్లిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎన్‌డిఎ వస్తే తనకు ముఖ్యమంత్రి పదవి కంటే, రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటానని చెప్పారు.

కొల్లూరులో కేంద్ర ఆర్థికమంత్రి

యశవంతపుర: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉడుపి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కొల్లూరు మూకాంబికా దేవి ఆలయాన్ని దర్శించి అమ్మవారికి పూజలు చేశారు. ఆమెకు దేవస్థానం అర్చకులు సకల లాంఛనాలతో స్వాగతించారు. తరువాత ఆమె ఉడుపికి పయనమయ్యారు.

షారిక్‌కు శిక్ష పెంచాలన్న ఎన్‌ఐఏ

యశవంతపుర: మంగళూరు కుక్కర్‌ బాంబ్‌ పేలుడు కేసులో ఉగ్రవాది మహమ్మద్‌ షారిక్‌కు ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు 10 ఏళ్లు శిక్ష విధించడం తెలిసిందే. ఇప్పటికే నాలుగేళ్లు జైలులో ఉన్నందున 6 ఏళ్లు శిక్ష అనుభవిస్తే విడుదల కావచ్చు. ఇది చాలా తక్కువ శిక్ష అని, అతడు బయటకు వస్తే ప్రమాదకరమని, కాబట్టి జైలు శిక్షను పెంచాలని ఎన్‌ఐఎ అధికారులు హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు. అంత పెద్ద కేసులో 10 ఏళ్ల శిక్ష చాల తక్కువని అసంతృప్తితో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement