గంజాయి కేసుకు భయపడి విద్యార్థి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

గంజాయి కేసుకు భయపడి విద్యార్థి ఆత్మహత్య

Apr 29 2026 7:48 AM | Updated on Apr 29 2026 7:48 AM

హుబ్లీ: పరువు పోతుందని గంజాయి కేసుకు భయపడి ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ధార్వాడ జిల్లాలో చోటు చేసుకుంది. గిరినగరలోని ఓ ఇంట్లో ఆదిత్య మ్యాగేరి(27) అనే యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిత్య కిటిల్‌ కళాశాలలో బీఎస్సీ చదివేవాడు. గత శనివారం విద్యాగిరి పోలీసులు ఆదిత్యను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి సేవించాడని, పరీక్ష చేయించగా నెగిటివ్‌ నివేదిక వచ్చింది. ఈ సందర్భంగా పోలీసులు సుమారు 40 మందికి పైగా యువకులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి కేసులో నెగిటివ్‌ నివేదిక వచ్చినా ఆదిత్య నుంచి రూ.2,000 పోలీసులు లంచంగా తీసుకున్నారు. అసలు రూ.10,000 డిమాండ్‌ చేయగా అనంతరం రూ.2,000లతో సరి పెట్టుకున్నారు. దీంతో గంజాయి కేసులో తన పరువు పోయిందన్న బాధతో ఆదిత్య మ్యాగేరి ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

నా బిడ్డ చావుకు పోలీసులే కారణం

కుమారుడి చావు తల్లి మనసును కలిచి వేసింది. తన కుమారుడి చావుకు పోలీసులే కారణమని ఆమె ఆరోపించారు. కుమారుడి శవం వద్ద మార్చురీ ఎదుట ఆ తల్లి కన్నీటి తడి అందరి గుండెలను పిండేసింది. మరో వైపు గంజాయి పరీక్ష వేళ పాజిటివ్‌ వచ్చిన వారి నుంచి పోలీసులు రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు ఫోన్‌పే ద్వారా సొమ్ములు రాబట్టినట్లు సమాచారం. ఆ అవకాశం లేని వారి నుంచి మూడో వ్యక్తి ద్వారా కూడా డబ్బులు వేయించుకున్నట్లు, లంచం ఇవ్వక పోతే వేరే కేసులో పెట్టి లోపలికి వేస్తామని బెదిరించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో తల్లిదండ్రులు లంచగొండి కానిస్టేబుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement