కనులవిందుగా రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

కనులవిందుగా రథోత్సవం

Apr 19 2026 7:53 AM | Updated on Apr 19 2026 7:53 AM

కోలారు: ముళబాగిలు నగరంలోని పురాణ ప్రసిద్ధ శ్రీ ప్రసన్న సోమేశ్వర స్వామి బ్రహ్మ రథోత్సవం శనివారం కనులపండువగా జరిగింది. మూలవిరాట్టుకు పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం, విశేల పూజలు జరిగాయి. ఆలయ ఆవరణలోని బాల సుబ్రమణ్యస్వామి, బసవణ్ణ, చాముండి దేవికి పూజలు నిర్వహించారు. వేదమంత్ర ఘోష మధ్యన స్వామివారి ఉత్సవ మూర్తిని తేరులో ప్రతిష్టించారు. జై సోమేశ్వర అని నినదిస్తూ తేరును లాగారు. భక్తజనం దవనం, అరటిపండ్లు విసిరారు. ఎమ్మెల్యే సమృధ్ది మంజునాథ్‌తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

రైతు ప్రాణం తీసిన అప్పులు

పావగడ: తుమకూరు జిల్లాలో అప్పుల బాధ తాళ లేక ఓ అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు. పావగడ తాలూకా లోని దవడబెట్ట రొప్ప గ్రామంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రైతు నాగరాజు (56) పంటల సాగుకు చేసిన అప్పులు నష్టాల వల్ల తీర్చలేకపోయాడు. అప్పులిచ్చిన వాళ్ళ ఒత్తిళ్ళు భరించలేక చావే శరణ్యమని విరక్తి చెంది నాగరాజు గ్రామ సమీపంలోని ఓ పొలంలోని చింత చెట్టుకు ఉరేసుకున్నాడు. కొమ్మ చాలా ఎత్తుగా అందకపోవడంతో, తన బైక్‌ను నిలిపి దాని మీద ఎక్కి కొమ్మకు ఉరి బిగించుకోవడం గమనార్హం. ఈ ఘటనతో కుటుంబీకులు, స్థానికులు తీవ్ర విషాదానికి లోనయ్యారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఆఫ్రికన్‌ చీతాల రాక

బన్నేరుఘట్ట జూపార్క్‌లో బస

బొమ్మనహళ్లి: భారతదేశంలో లేని క్రూరమృగాల్లో చీతాలు ఒకటి. అవి మనదేశంలో ఎప్పుడో అంతరించిపోయాయి. అక్కడక్కడ జూలలో మాత్రమే కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా నుంచి నాలుగు ఆఫ్రికన్‌ చీతాలను బెంగళూరు బన్నేరుఘట్ట జూపార్క్‌ కు శుక్రవారం అర్ధరాత్రి చేరుకున్నాయి. విమానంలో కెంపేగౌడ విమానాశ్రయానికి చేరుకోగానే మంత్రి ఈశ్వర్‌ ఖండ్రే, అధికారులు స్వాగతం పలికారు. వాటిని జూపార్క్‌ కు తరలించారు. ఇవి అక్కడి వాతావరణానికి అలవాటు పడటానికి 30 రోజుల పాటు కఠినమైన క్వారంటైన్‌లో ఉంచుతారు. ఈ కాలంలో నిత్యం పర్యవేక్షిస్తారు. క్వారంటైన్‌ కాలం ముగిసిన తర్వాత వాటిని కేటాయించిన బసలలో సందర్శకులకు అందుబాటులో ఉంచుతారు. చీతాలను జాగ్రత్తగా చూసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఒకప్పుడు మన కర్ణాటక అడవులలో కనిపించిన చీతాలు ఇప్పుడు కనుమరుగయ్యాయి. కనీసం జూలో అయినా చూసే అవకాశం ప్రజలకు ఉండాలని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement