రాయచూరు రూరల్: యాదగిరి జిల్లా సురపుర తాలూకాలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన సిరవార పట్టణ పంచాయతీ మాజీ సభ్యుడు కృష్ణా నాయక్, భార్య అనంతకళ, శరణప్ప, నిసర్గ, సిద్ధార్థ, శశికళ మరణించడంతో వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, శాసన సభ్యుడు హంపయ్య నాయక్ పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. శనివారం సిరవారలోని కృష్ణా నాయక్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పలకరించి ఘటన పూర్వాపరాల గురించి తెలుసుకుని ఓదార్చి ధైర్యం చెప్పారు.
పెట్టుబడి పేరుతో రూ.22 లక్షల వంచన
హుబ్లీ: డబ్బులు పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు గడించవచ్చని నమ్మించిన గుర్తు తెలియని వ్యక్తి ధార్వాడ నివాసిని రూ.22.92 లక్షలు వంచించిన ఘటనపై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ధార్వాడ సైదాపుర హొసపేటె నివాసి పునీత్ అంబన్నవర డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి. పునీత్ ఇన్‌స్టాలో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ గురించి ప్రకటన చూశారు. ఈ క్రమంలో టెలిగ్రాం లింక్ పంపించిన గుర్తు తెలియని వ్యక్తులు క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చని నమ్మించి విడతల వారీగా డబ్బులను తమ ఖాతాలోకి బదలాయించుకొని మోసగించినట్లు బాధితుడు పేర్కొన్నారు.
రక్షణ కవచం.. ఎండ దూరం
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు అధికం అవుతుండడంతో ప్రజలకు మిట్టమధ్యాహ్నం రోడ్లపై ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్ లైట్ల వద్ద నిలువ నీడ కోసం యాదగిరి శాసన సభ్యుడు చెన్నారెడ్డి పాటిల్ తన్నూరు చొరవ చూపి రక్షణ కవచాలను కల్పించారు. నగరంలోని సుభాష్ సర్కిల్, బసవేశ్వర గంజ్, అంబేడ్కర్, రైల్వే స్టేషన్ల వద్ద నిలువ నీడ కోసం రక్షణ కవచాలను ఏర్పాటు చేసిన కూడళ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. నగరంలోని ప్రధాన రహదారులపై దుమ్ము, ధూళి నుంచి రక్షణకు నీటిని చల్లాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ఘనంగా సంస్థాపన దినం
రాయచూరు రూరల్: నగరంలో వాల్మీకి నాయక్ సమాజ్ సంస్థాపన దినం వైభవంగా జరిగింది. శనివారం వాల్మీకి సర్కిల్ వద్ద వందలాది మంది సమక్షంలో మహర్షి వాల్మీకి విగ్రహానికి, శ్రీకృష్ణదేవరాయల చిత్రపటాలకు కళ్యాణ కర్ణాటక డివిజన్ అధ్యక్షుడు రఘువీర్ నాయక్ పూలమాలలు వేసి పూజ చేశారు.
తాగునీటి కోసం ధర్నా
రాయచూరు రూరల్: వేసవిలో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజా ప్రతినిధులు, మంత్రులు అధికారులకు ఆదేశాలు జారీ చేసినా స్పందించక పోవడాన్ని గ్రామస్తులు తప్పుబడుతూ ఆందోళన చేపట్టారు. శుక్రవారం రాత్రి జిల్లాలోని మాన్వి తాలూకా బాగలవాడలో నీరు వదలాలని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఉన్నఫళంగా అధికారి గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి పరారవడంతో కార్యాలయం వద్ద బైఠాయించి తమ ఆందోళన కొనసాగించారు.
గంజాయి విక్రేతల అరెస్టు
కేజీఎఫ్: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసిన రాబర్ట్‌సన్ పేట పోలీసులు వారి నుంచి రూ.23 వేలు విలువ చేసే 410 గ్రాముల గంజాయి, 2 గ్రాముల ఎండీఎంను స్వాధీనం చేసుకున్నారు. కెజీఎఫ్ ఇటి బ్లాక్ నివాసి అజయ కుమార్, కెఎన్‌జెఎస్ బ్లాక్ నివాసి మహమ్మద్ యూసుఫ్, శర్మ అలియాస్ యక్షగోర్ శర్మ అరెస్టు అయిన నిందితులు. వీరిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేశారు.


