రాయచూరు రూరల్: వేసవిలో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, తాగునీటికి పరీక్షలు నిర్వహించాలని జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఆరోగ్య అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కొళాయిల్లో కలుషిత నీరు సరఫరా అవుతున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అధికారులు క్రమం తప్పకుండా నీటి పరీక్షలు చేయాలన్నారు. వేసవిలో 40 శాతం మేర ఉష్ణోగ్రతలు ఉండడంతో బాలింతలు, గర్భిణులకు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. పంచాయతీలో హైడ్రోజన్ క్లోరైడ్, ఫ్లోరైడ్, ఐరన్, నైట్రేట్, అల్కలైనిజ్, హైడ్రోజన్ సల్ఫైడ్‌తో నీటి పరీక్షలు జరపాలన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను నిల్వ ఉంచాలన్నారు. సమావేశంలో జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్ర బాబు, ఐసీడీఎస్ అధికారి నవీన్ కుమార్, ఆర్‌సీహెచ్ అధికారిణి నందిత, వైద్యులు శంకర గౌడ, చంద్ర శేఖరయ్య, శివకుమార్, షాకీర్, గణేష్, కుమార్‌లున్నారు.
పెళ్లి చేసుకుంటానని రూ.5 లక్షలు మస్కా
హుబ్లీ: పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.5 లక్షలను దోచుకున్న యువతి ఘరానా మోసానికి పాల్పడిన ఉదంతం ఇది. పెళ్లిళ్ల ప్రకటనల యాప్‌లో పరిచయమైన యువతి ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.5 లక్షలు తీసుకొంది. పెళ్లి చేసుకొనే ప్రస్తావన తెస్తే ప్రాణాలు తీస్తానంటూ బెదిరించడంతో ఆ యువతితో పాటు ముగ్గురిపై హుబ్లీ టౌన్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఏడాది క్రితం రమన్ అహమ్మద్‌కు ఫిర్దోస్‌షేక్ అనే యువతి పరిచయం అయింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి అతడితో కలిసి హోటళ్లు, మాల్స్, పబ్‌లు, సినిమాలకు షికార్లు చేసింది. ఆ తర్వాత అతడి నుంచి డబ్బులు తీసుకొని, వాటిని తిరిగి ఇవ్వమని అడిగితే చంపుతానని బెదిరించడంతో ఫిర్దోస్‌షేక్ అనే యువతి, ఆమె తండ్రి అబ్దుల్ షేక్, తల్లి కౌసర్‌బానులపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితుడు రమన్ అహమ్మద్ పేర్కొన్నారు.
సీహెచ్ పౌడర్ విక్రేతల అరెస్ట్
రాయచూరు రూరల్ : నగర ప్రాంతాల్లో సీహెచ్ పౌడర్ విక్రయం చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని ఎస్పీ అరుణాంగ్శు గిరి వెల్లడించారు. శుక్రవారం రాత్రి ఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నగరంలోని రైల్వే ఉద్యానవనం వద్ద మహ్మద్ హాజీ, నాగరాజ్‌లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 35 లీటర్ల కల్తీ కల్లు, 30 లీటర్ల సీహెచ్ పౌడర్‌ను స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. పశ్చిమ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ మంజునాథ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
సమస్యలు పరిష్కరించండి
కోలారు: ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడా, గ్రేటర్ నోయిడా, గురుగావ్‌లో ప్రతిఘటన నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా సమితి సభ్యులు డిమాండ్ చేశారు. శనివారం డిప్యూటీ తహసీల్దార్ వినతిపత్రం సమర్పించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం ప్రతిఘటనను అణగదొక్కే ప్రయత్నాన్ని చేస్తోందని ఆరోపించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.విజయకృష్ణ మాట్లాడుతూ.. దేశ రాజధాని సమీపంలో ఉన్న ఈ నగరంలోని పారిశ్రామిక ప్రాంతంలో కాంట్రాక్టు కార్మికులే అధికంగా పని చేస్తున్నారన్నారు. వీరికి నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వేతనం ఇస్తూ నిత్యం 10 నుంచి 12 గంటల పాడు పని చేయించుకుంటున్నారని ఆరోపించారు.


