హొసపేటె: విజయనగర జిల్లా హువినహడగలి తాలూకాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ఈదురు గాలులకు కొన్ని చోట్ల చెట్లు విరిగి పడ్డాయి. విరిగిన చెట్లు విద్యుత్ తీగల మీద పడటంతో కరెంటు తీగలు తెగి విద్యుత్ స్తంభాలు విరిగాయి. విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో ఎక్కడా ఎలాంటి ప్రమాద ఘటనలు చోటు చేసుకోలేదు. ఈదురు గాలుల ధాటికి ఉత్తంగి, హొళగుంద మధ్య ఉన్న రహదారిపై రెండు భారీ వృక్షాలు కూలిపడ్డాయి. ఉత్తంగి గ్రామస్తుల సహకారంతో ఒక జేసీబీ యంత్రాన్ని ఉపయోగించి ఆ చెట్టును తొలగించారు. తద్వారా ప్రజలు, వాహనదారుల రాకపోకలకు మార్గం సుగమమైంది. చెట్లు విరిగిన ప్రదేశాలను విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించారు. చెట్ల కొమ్మలను తొలగించారు. తెగిపడిన విద్యుత్ లైన్లను, స్తంభాలను పునరుద్ధరించే పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టారు.
గాలులకు విరిగిపడిన చెట్లు
కూలిన విద్యుత్ స్తంభాలు


