బళ్లారిఅర్బన్: ఇటీవల విడుదలైన ద్వితీయ పీయూసీ పరీక్షల ఫలితాల్లో బసవరాజేశ్వరి సమూహ విద్యాసంస్థల బీపీఎస్సీ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. కళాశాలలో మొత్తం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 92.42గా నమోదు కాగా, 135 మంది విద్యార్థులు డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణులయ్యారు. వాణిజ్య శాస్త్ర విభాగంలో పారేఖ్ 600 మార్కులకు గాను 594 మార్కులు సాధించి ఆగ్రస్థానంలో నిలిచారు. విజ్ఞాన శాస్త్ర విభాగంలో యూ. వెంకట్ రాహుల్ 585 మార్కులతో 97.5 శాతం ఉత్తీర్ణతతో కళాశాలకే మొదటి స్థానం సాధించారు. అంతేకాకుండా 70 మంది విద్యార్థులు వివిధ సబ్జెక్ట్‌ల్లో 100కు 100 మార్కులు సాధించి కళాశాలకు కీర్తి తెచ్చారు. శనివారం అనంతపురం రోడ్డులోని బీపీఎస్సీ కళాశాల సభాంగణంలో ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. సంస్థ చైర్మన్ డాక్టర్.యశ్వంత్ భూపాల్, ప్రిన్సిపాల్ హెచ్.త్రిపురాంబ, అధ్యాపకులు కలిసి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, మొమెంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు.


