బనశంకరి: ధారవాడ జెడ్పీ బీజేపీ సభ్యుడు యోగేశ్‌గౌడ హత్య కేసులో ధారవాడ గ్రామీణ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణికి శుక్రవారం బెంగళూరు ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. హత్య, కుట్ర ఆరోపణలపై ఎమ్మెల్యే వినయ్‌కులకర్ణి 15వ ముద్దాయిగా ఉండగా మొత్తం 16 మందికి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన భట్ యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు ప్రకటించారు. అంతేకాకుండా తలా రూ.30 వేలు చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించారు. లాగే ఏ–17గా ఉన్న చెన్నకేశవ టింగరికర్‌కు ఏడేళ్ల జైలుశిక్ష విధించారు. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే సీబీఐ అధికారులు వినయ్‌కులకర్ణితో పాటు 17 మందిని అదుపులోకి తీసుకుని పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. కాగా యోగేశ్‌గౌడ హత్య కేసును అప్పటి బీజేపీ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు అప్పగించింది. సీబీఐ అధికారులు కేసు దర్యాప్తు చేపట్టి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి, ఇద్దరు పోలీస్ అధికారులతో పాటు మొత్తం 21 మంది పేర్లను చార్జిషీట్‌లో ప్రస్తావించారు. కానీ 17 మందిపై మాత్రమే నేరం రుజువైంది. మిగతా నలుగురికి కేసు నుంచి విముక్తి లభించింది.
రూ.16 లక్షలు పరిహారంగా ఇవ్వాలని సూచన
హత్యకు గురైన యోగేశ్‌గౌడ కుటుంబానికి రూ.16 లక్షల పరిహారం అందించాలని కోర్టు సూచించింది. ప్రతి సెక్షన్‌కు కోర్టు ప్రత్యేకంగా జరిమానా విధించడంతో పాటు ఏ1 ముద్దాయి ముత్తగికి మాఫీ సాక్షి స్థానాన్ని కోర్టు ఖాయం చేసింది. వ్యక్తిగత, రాజకీయ ద్వేషం నేపథ్యంలో 2016 జూన్ 15వ తేదీ యోగేశ్‌గౌడ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసు హుబ్లీ, ధారవాడలో తీవ్ర రాజకీయ చర్చకు దారి తీసింది. సుమారు పదేళ్ల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పు వెలువడింది. బీజేపీ నేత యోగేశ్‌గౌడ, ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి మధ్య కొన్ని విషయాల్లో అంతర్గత భిన్నాభిప్రాయాలు ఉండేవి. యోగేశ్‌గౌడ ధారవాడ జెడ్పీ బీజేపీ సభ్యుడిగా ఉన్నారు. జెడ్పీలో తాగునీటి విషయంపై సమావేశంలో యోగేశ్‌గౌడ, వినయ్ కులకర్ణి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఆసుపత్రిలో గొడవకు సంబంధించి వీడియో వైరల్‌గా మారింది. దీని వెనుక యోగేశ్‌గౌడ హస్తం ఉందని చర్చ జరిగింది. ఈనేపథ్యంలో అనేక కారణాలతో ఇరువురి మధ్య వైరం ఏర్పడింది.
ఎవరెవరికి యావజ్జీవ శిక్ష...
ఏ2–విక్రమ్, ఏ3–కీర్తికుమార్, ఏ4–సందీప్, ఏ5–వినాయక, ఏ6–మహాబలేశ్వర, ఏ7–సంతోష్, ఏ8–దినేశ్, ఏ9–అశ్వథ్, ఏ10–సునీల్, ఏ11–నజీర్‌అహ్మద్, ఏ12–శానవార్, ఏ13–నూతన్, ఏ14–హర్షిత్, ఏ15–వినయ్‌కులకర్ణి, ఏ16–చంద్రశేఖర్ ఇండి, ఏ18–వికాస్ కలబురిగి
బసవరాజ కొరవర్ ఇంటికి భద్రత
బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఆర్‌టీఐ కార్యకర్త బసవరాజ కొరవర్ ధారవాడలోని నివాసానికి పటిష్ట పోలీసు భద్రత కల్పించారు. యోగేశ్‌గౌడ హత్య కేసులో బసవరాజ్ కొరవర్ ప్రముఖ పాత్ర వహించారు. ఈ నేపథ్యంలో ఇతడి ఇంటికి 10 మందికి పైగా పోలీస్ సిబ్బందితో భద్రత కల్పించారు.
దుస్తులు మార్చుకోడానికి అవకాశం ఇవ్వండి
ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి మూడు రోజుల నుంచి ఒకే డ్రస్‌లో ఉన్నారని, దుస్తులు మార్చుకోడానికి అనుమతి ఇవ్వాలని వినయ్ కులకర్ణి తరఫు న్యాయవాది న్యాయమూర్తి సంతోష్ గజానన భట్‌కు మనవి చేశారు.
దోషిగా తేలిన మరో ముద్దాయికి ఏడు సంవత్సరాల జైలు
యోగేశ్‌గౌడ హత్యకేసులో
తుది తీర్పు ప్రకటించిన
ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు
కేసులో హైలైట్లు.....
2016 జూన్ 15న ధార్వాడ జెడ్పీ సభ్యుడు యోగేశ్‌గౌడ దారుణ హత్య
యోగేశ్‌గౌడ జిమ్‌లో ఉండగా కళ్లలో కారం చల్లి మారణాయుధాలతో దాడి చేసి కడతేర్చారు
యోగేశ్‌గౌడ హత్య కేసులో మొదట
ఆరుగురు అరెస్ట్
కేసులో 21 మందిపై
కోర్టులో చార్జిషీట్ అందజేత
సుదీర్ఘ విచారణలో 17 మంది ముద్దాయిలుగా రుజువు
ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు బుధవారం 17 మందిపై తీర్పు వెల్లడి
సీబీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ.రాజు వాదనలు
బసవరాజ ముత్తగి, శివానంద శ్రీశైల బిరాదార మాఫీ సాక్షులు
వాసుదేవ ఆమనిలేకణి, సోమశేఖర బసప్ప న్యామగౌడకు కేసు నుంచి విముక్తి


