శివాజీనగర: రాష్ట్రంలో ఎండ వేడిమి రోజు రోజుకు పెరుగుతోంది. ఉత్తర కర్ణాటకలో సూర్యుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల పర్యవేక్షణ కేంద్రం (కేఎస్‌ఎన్‌డీఎంసీ) ఏప్రిల్ 16న విడుదల చేసిన నివేదిక ప్రకారం బీదర్, కల్బుర్గి జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కేఎస్‌ఎన్‌డీఎంసీ నివేదిక ప్రకారం గత 24 గంటల్లో బీదర్ జిల్లాలోని ‘చితంకి’ ఫిర్కాలో 44.6 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది రాష్ట్రంలోనే అత్యధికమైన ఉష్ణోగ్రతగా నిలిచింది. రాష్ట్రంలో 7 జిల్లాలకు ఎండవేడిమి ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
42 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రత
నమోదైన ప్రాంతాలు:
కల్బుర్గి, రాయచూరు, బీదర్, విజయపుర జిల్లాల్లో అనేక చోట్ల, యాదగిరి, బాగలకోటెలో పలు చోట్ల, బెళగావి, బళ్లారి, గదగ, కొప్పళ, చిత్రదుర్గ, విజయనగరలో ఒకటి రెండు చోట్లలో ఉష్ణోగ్రత 42 నుంచి 44.6 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదైంది.
ప్రతిరోజు కంటే ఎండలు అధికం:
వాతావరణ పర్యవేక్షణ బృందం సమాచారం ప్రకారంరాష్ట్రంలో పలు స్థలాల్లో వాతావరణం 42 డిగ్రీల సెల్సియస్ దాటింది. ఉత్తర ఒళనాడు, దక్షిణ ఒళనాడులో ఒకటి రెండు చోట్ల గరిష్ట ఉష్ణోగ్రత మునుపటి కంటే 1.6 డిగ్రీల సెల్సియస్ నుంచి 3 సెల్సియస్ మేరకు అధికమైనట్లు కనిపించింది.
మరో 5 రోజుల పాటు హెచ్చరిక:
భారతీయ వాతావరణ శాఖ సూచన ప్రకారం ఏప్రిల్ 16 నుంచి 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశముంది. మరో 3 రోజుల పాటు ఉత్తర ఒళనాడులో తీవ్ర వడ గాలులు వీచే అవకాశముందని హెచ్చరించారు. కరావళి కర్ణాటకలో ఎండవేడిమి, అతిగా వేడిమి ఉండనుంది.
ఎండవేడిమి ఎల్లో అలర్ట్ జిల్లాలు ఇవీ?
ఈనెల 20 వరకు బాగలకోటె, విజయపుర, కల్బుర్గి, బీదర్, దక్షిణ కన్నడ, ఉడుపి, ఉత్తర కన్నడకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
బెంగళూరులో 36 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత
బెంగళూరులో గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్ దాటింది. మూడు రోజుల నుంచి గరిష్ట ఉష్ణోగ్రత 35, 36, 36.6 డిగ్రీల సెల్సియస్ కనిపించింది. బుధవారం ఉదయాన్నే నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదైంది. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంతంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 37, హెచ్‌ఏఎల్‌లో 36.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే ఐదు రోజుల్లో ఉత్తర కర్ణాటక, కల్యాణ కర్ణాటకల్లా బెంగళూరులో కూడా రికార్డు స్థాయి ఉష్ణోగ్రత కనిపించనుంది. వేడి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ సూచన చేసింది. మధ్యాహ్నం 12 గంటలకు, 2 నుంచి 3 గంటల సమయంలో గరిష్ట ఎండ వేడిమి కనిపిస్తోంది.
రికార్డు స్థాయిలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత
ఏడు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటన


