ఢిల్లీకి కర్ణాటక సీఎం, డీసీఎం | - | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి కర్ణాటక సీఎం, డీసీఎం

Apr 18 2026 7:47 AM | Updated on Apr 18 2026 7:47 AM

సాక్షి బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌లు హస్తిన బాట పట్టారు. ఇద్దరు అధినేతలు చాలా రోజుల తర్వాత అది కూడా కలసికట్టుగా ఢిల్లీకి వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఢిల్లీలో జరిగిన బ్రిడ్జ్‌ టు బెంగళూరు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇద్దరు అధినేతలు ఢిల్లీకి వెళ్లారు. ఇదే సమయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోకసభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలాతో ఇద్దరు నేతలు భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం పార్లమెంట్‌ సమావేశాల్లో కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ నేతలంతా బిజీగా ఉన్నారు. దీంతో అధిష్టానం నేతలతో భేటీ అయ్యే అవకాశాలు కొద్దిగా తక్కువేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ, రాజ్యసభ, విధాన పరిషత్‌ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక, పాలక మండళ్లకు నియామకాలు తదితర అంశాలు హైకమాండ్‌ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో ఇద్దరు అధినేతలు ఢిల్లీకి వెళ్లడంతో ఆశావహుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇదే సమయంలో సీఎం సిద్ధరామయ్య వర్గీయులకు అడుగడుగునా ఎదురవుతున్న ఎదురు దెబ్బల నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. కాగా, రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలోని కొన్ని సమస్యలకు శనివారం అధిష్టానం పెద్దలతో చర్చించి పరిష్కారం తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో ఎత్తుకుపైఎత్తులు మళ్లీ జోరందుకున్నాయి. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో తమకు అవకాశం కల్పించాలంటూ 15 మందికి పైగా సీనియర్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఇటీవల ఢిల్లీకి వెళ్లి అధిష్టానం నేతలను కలిశారు. నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి మంతనాలు జరిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయిన తరుణంలో మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని వినతులు సమర్పించారు. వీరిలో ఎక్కువ మంది సీఎం సిద్ధరామయ్య వర్గీయులే ఉండడం గమనార్హం. అయితే ఈ సీనియర్ల తరపున ఢిల్లీకి వెళ్లిన సీఎం సిద్ధరామయ్య మంత్రివర్గం పునర్వ్యస్థీకరణకు అవకాశం కల్పించాలని కోరనున్నారు. బ్రిడ్జి టు బెంగళూరు కార్యక్రమం ముగిసిన వెంటనే సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు వేర్వేరుగా పార్టీ పెద్దలను కలుసుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో డీకే శివకుమార్‌ కూడా నాయకత్వ మార్పు గురించి తన డిమాండ్‌ను వినిపించే అవకాశం కూడా ఉంది. తొలుత నాయకత్వ మార్పు చేసి ఆ తర్వాత మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ చేపట్టాలని కోరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు హైకమాండ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే అనేక రాజకీయ గందరగోళాలకు తావిచ్చినట్లు అవుతుంది. ఆశావహులు ఎక్కువ మంది ఉండడంతో మంత్రి పదవి ఎవరిని వరిస్తుందోనన్న ఊహాగానాలు జోరందుకుంటాయి. ఇదే సమయంలో నాయకత్వ మార్పు లేన్నట్లేనన్న సంకేతాలు పంపినట్లు అవుతుంది. కాబట్టి ఈసారి కూడా హైకమాండ్‌ వేచి చూసే ధోరణి అవలంభించే అవకాశముంది. ఇదే సమయంలో రాజ్యసభ సభ్యుల ఎంపికకు సంబంధించి కూడా సీఎం, డీసీఎంలు ఢిల్లీ నేతలతో చర్చించనున్నారు. పాలకమండళ్లకు నియామకాలకు కూడా అధిష్టానం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వాల్సి ఉంది.మొత్తానికి ఇద్దరు నేతలు పలు డిమాండ్లు, వినతులతో ఢిల్లీకి వెళ్లారు. ఎప్పటిలాగే వట్టి చేతులతో తిరిగి వస్తారో లేక తాము అనుకున్నది సాధించుకుని వస్తారో అన్న విషయం మరో రెండు రోజుల్లో తేలనుంది.

అధిష్టానంతో భేటీకి అవకాశం

రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ గందరగోళాలపై చర్చ

పలు విజ్ఞప్తులు విన్నవించే అవకాశం

Advertisement
 
Advertisement
Advertisement