సీఎం తీరుపై మాజీ మంత్రి అసంతృప్తి | - | Sakshi
Sakshi News home page

సీఎం తీరుపై మాజీ మంత్రి అసంతృప్తి

Apr 18 2026 7:47 AM | Updated on Apr 18 2026 7:47 AM

శివాజీనగర: ముఖ్యమంత్రి సిద్దరామయ్య సన్నిహితులపై హైకమాండ్‌ క్రమశిక్షణ చర్యలు తీసుకొంటున్నా సిద్దూ అసహాయకుడిలా ఉండటంపై మాజీ మంత్రి కే.ఎన్‌.రాజణ్ణ అసంతృప్తిని వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి సన్నిహిత వర్గంగా గుర్తింపు పొందిన ఎమ్మెల్యేలు, మంత్రులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా సిద్దూ మౌనంగా ఉండటం విచారకరమన్నారు. దావణగెరె దక్షిణ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఆరోపణలపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఇటీవల ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి స్థానం నుంచి నజీర్‌ అహమ్మద్‌ను సస్పెండ్‌ చేయగా, ఎమ్మెల్సీ అబ్దుల్‌ జబ్బార్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారన్నారు. మంత్రి జమీర్‌ అహమ్మద్‌ ఖాన్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని హైకమాండ్‌పై ఒత్తిడి ఉంది. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాత్రం మౌనంగా ఉండటంపై రాజణ్ణ తన అసంతృప్తిని వెళ్లగక్కారు.

హైదరాబాద్‌కు మరో ఫ్లైట్‌ సర్వీసు

మైసూరు: మైసూరు నుంచి హైదరాబాద్‌కు మరో విమాన సర్వీసు త్వరలో ప్రారంభం కానుందని మైసూరు–కొడగు ఎంపీ యదువీర్‌ కష్ణదత్త చామరాజ ఒడయార్‌ తెలిపారు. ఈమేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ విమాన సర్వీసు మే 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుందన్నారు.

జలమండలికి ఐఎస్‌ఓ గుర్తింపు

బనశంకరి: బెంగళూరు నీటి సరఫరా భూగర్భ డ్రైనేజీ మండలి(బీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ) ఐఎస్‌ఓ 50001: 2018 ప్రమాణపత్రం పొందిన దేశంలోనే మొదటి జలమండలిగా ఖ్యాతి గడించింది. ప్రతిష్టాత్మకమైన ఐఎస్‌ఓ ఇంధన నిర్వహణ సర్టిఫికెట్‌ పొందినందుకు మండలి అధ్యక్షుడు రామ్‌ప్రసాత్‌ మనోహర్‌ బృందానికి శుక్రవారం డీసీఎం అభినందనలు తెలిపారు. శుక్రవారం జలమండలి కార్యాలయంలో ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ను డీసీఎం ప్రదర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement