సాక్షి, బళ్లారి: నగరంలో రోజు రోజుకు కుక్కల బెడద అధికం అవుతోంది. ఆయా కాలనీల్లో శునకాలు స్వైర విహారం చేస్తుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు. గుంపులుగా తిరుగుతూ అకస్మాత్తుగా దాడులకు తెగబడుతున్నాయి. ఇక రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులపై పరుగెత్తుకుంటూ వెళ్తుండటంతో వారు ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం నగరంలో మోకా రోడ్డులో వాజ్‌పాయి లేఅవుట్‌లో ఓ బాలుడిని కుక్కల గుంపు తరుముకుంటూ వచ్చి దాడి చేసింది. గమనించిన స్థానికులు వెంటనే కుక్కలను తరమడంతో ప్రమాదం తప్పింది. బళ్లారి నగరంలో నిత్యం ఏదో ఒక కాలనీలో కుక్కల దాడిలో ప్రజలు గాయపడటం సర్వసాధారణంగా మారింది. కుక్కల సంచారంతో ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. రేబిస్, సంతాన హరణ ఇంజక్షన్లు వేసి కుక్కల సంతతిని నియంత్రించాలని సూచించింది. అయితే మహానగర పాలికె పాలకులు, కమిషనర్ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇటీవల మహానగర పాలికె అధికారులు తుతూమంత్రంగా ఏదో ఒక కాలనీలో కొన్ని కుక్కలను ఇలా పట్టుకుని వెళ్లి అలా యథావిధిగా వాటిని వదిలి వెళ్తున్నారు. దీంతో కుక్కల సంతతి మరింతగా పెరిగిపోయింది. ఇలా అయితే కుక్కల నియంత్రణ ఎక్కడ సాధ్యం అవుతుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల సమచారం పచ్రారం ఒక్క బళ్లారి నగరలో సుమారు 40 వేల కుక్కలు ఉన్నాయని సమాచారం. గడిచిన 6 నెలల వ్యవధిలో బళ్లారి జిల్లా వ్యాప్తంగా 4 వేల మంది కుక్కకాటుకు గురైనట్లు సమాచారం. మేజర్ బళ్లారిలో 2 వేల మంది కుక్కకాటు బాధితులు ఉన్నారు. వీరిలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.
కుక్కల నియంత్రణకు చర్యలు ఏవీ?
ప్రతి సంవత్సరం కుక్కల నియంత్రణ చేస్తున్నామంటూ అధికారులు ప్రభుత్వం నుంచి బిల్లులు చేసుకుంటున్నారు. అయితే ఏ వార్డులో కుక్కల నియంత్రణ చేశారో పాలికె అధికారులు, పాలకులకే తెలియాలని జనం ఽఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి కుక్కకు రేబిస్ వ్యాధికి సంబంధించిన ఇంజక్షన్లు వేయాలి. రేబిస్ టీకా వేస్తే ఒకవేళ ఆ కుక్క కరచిన అంతగా ప్రమాదం ఉండదు. వీధి కుక్కలకు సంతానహరణ చికిత్సలతో పాటు రేబిస్ ఇంజక్షన్లు వేస్తే జనం ప్రాణాలను కాపాడిన వారవుతారు. అభివృద్ధి మాట అటుంచి తొలుత ప్రతి చోట కుక్కల సంతానహరణపై దృష్టి సారించాలని పాలకులకు జనం సూచిస్తున్నారు.
బళ్లారిలో దాడులకు
తెగబడుతున్న గ్రామ సింహాలు
రాత్రి వేళల్లో వెంటాడి కరుస్తున్న వైనం
ప్రమాదాలకు గురవుతున్న
ద్విచక్ర వాహనదారులు
భయాందోళనతో పరుగులు తీస్తున్న జనం
చికిత్స చేయించుకోవాలి
కుక్కలు కరిచినప్పుడు నిర్లక్ష్యంగా ఉండకూడదు. వెంటనే జాగ్రత్తలు తీసుకుని వైద్యుడు చెప్పినట్లుగా సూచనలు పాటించలి. కుక్క కరిచిన వెంటనే సబ్బు నీటితో బాగా కడగాలి. దీనివల్ల వైరస్ లోపలికి వెళ్లే తీవ్రత తగ్గుతుంది. కుక్క కరిచిన 24 గంటల లోపు మొదటి డోసు రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవడం అత్యంత శ్రేయస్కరం. ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది. కరచిన కుక్క ఎలాంటిది అయినా వెంటనే ఇంజక్షన్లు వేయించుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుక్కకాటుకు ఇంజక్షన్లు అందుబాటులో ఉంటాయి. – రాజేష్,
చిన్నారులు వైద్య నిపుణుడు, బిమ్స్


