రాయచూరు రూరల్: మాన్వి తాలుకా గోర్కకల్ పంచాయతీ పరిధిలోని గవిగట్టులో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతు సంఘం జిల్లా సంచాలకురాలు అనిత ఆరోపించారు. గురువారం రాత్రి పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. గ్రామంలో గత 15 రోజులుగా తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదని మండిపడ్డారు. విద్యుత్ సరఫరా, శౌచాలయాల ఏర్పాటు, రహదారుల మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలీని అధికారికి వినతిపత్రం అందజేశారు.
విద్యార్థులకు వీడ్కోలు
రాయచూరు రూరల్: తాలుకాలోని కురుబదొడ్డి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఏడవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు, పాఠశాల వార్షికోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రాజుసాబ్ మాట్లాడుతూ.. సంస్కృతి, సంస్కారం, ఆచారవ్యవహాలు, సంప్రదాయాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలన్నారు. క్రమశిక్షణతో చదువుకుని ఉన్నతస్థాయికి చేరుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు వీరేష్, ఉపాధ్యక్షుడు గోవిందు, ఉపాధ్యాయులు విద్యావతి, యశోధర, రమాబాయి, సురేష్, గోవిందు తదితరులు పాల్గొన్నారు.
ఆత్మ విశ్వాసంతో విధులు నిర్వర్తించాలి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మ విశ్వాసంతో విధులు నిర్వర్తించాలని ఎస్టీ కమిషన్ సభ్యుడు జాహితె హుసేన్ సూచించారు. గురువారం సాయంత్రం రాయచూరులోని సర్కారు వైద్య కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిమ్స్‌లో రోగులకు సరైన చికిత్సలు, మందులు ఇతర సౌలభ్యాలు కల్పించాలని ఆదేశించారు. తల్లీబిడ్డల అస్పత్రిలో ఏసీ ఏర్పాటు చేయాలని తెలిపారు. రోగులను పలకరించేందుకు వచ్చిన వారి కోసం విశ్రాంతి భవనం నిర్మించాలన్నారు. అలాగే సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న హస్టళ్లను పరిశీలించారు. విద్యార్థులకు సరైన సమయంలో భోజనం, వసతి, ఇతరత్రా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు శివమానప్ప, వైద్యులు అరవింద్, జయకృష్ణ, సోమశేఖర్, శరణబసవ, నేతలు రవీంద్ర, లాలప్ప నాయక్ తదితరులు పాల్గొన్నారు.
సోలార్ పార్కు
ఏర్పాటుకు ప్రతిపాదనలు
రాయచూరు రూరల్: రాష్ట్రంలో 19 వేల మోగావ్యాట్ల సోలార్ విద్యుత్ ఉత్పాదనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాయచూరులో సోలార్ పార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సోలార్‌తో పాటు పవన, గాలి మరలతో విద్యుత్ ఉత్పాదనకు ప్రభుత్వం టెండర్లు పిలచినట్లు విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని రాయచూరుతో పాటు బెళగావి, గదగ, హవేరి, కొప్పళ, చిత్రదుర్గ, ఉత్తర కర్ణాటకకు విస్తరణకు చర్యలు చేపట్టారు. రైతులతో మాట్లాడి సోలార్ పార్కుల ఏర్పాటుకు అవసరమైన భూములను గుర్తిస్తున్నారు.
రౌడీషీటర్ నగర బహిష్కరణ
కెజీఎఫ్: నగరానికి చెందిన రౌడీషీటర్ అభిషేక్‌ను నగర బహిష్కరణ చేస్తూ అండర్‌సప్ పేట పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అభిషేక్ గత కొంతకాలంగా అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. 6 హత్యా ప్రయత్నాలు, 1 దౌర్జన్యం కేసు సహా ఇతడిపై మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. కోర్టు నుంచి జామీనుపై వచ్చిన అభిషేక్.. మళ్లీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో పోలీసులు నగర బహిష్కరణ చేస్తూ ఆదేశించారు. ఇతడిని హావేరి జిల్లా నగర పోలీస్ స్టేషన్ పరిధిలోకి బహిష్కరించారు.


