హుబ్లీ: ఆస్తుల విషయంలో తలెత్తిన గొడవలో కొడుకుపై తండ్రి దాడి చేయడమే కాకుండా హత్యయత్నానికి ప్రయత్నించిన ఘటన హుబ్లీ తాలూకా అదరగుంచి గ్రామంలో చోటు చేసుకుంది. ఆ గ్రామ మహంతేష్ సుకందపై అతడి తండ్రి యల్లప్ప దాడి చేశాడు. కుటుంబ విషయంగా గొడవ జరిగిన క్రమంలో కొడుకును కొట్టడంతో చేతులు, కడుపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. మహంతేష్‌ను చికిత్స నిమిత్తం స్థానిక కేఎంసీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై హుబ్లీ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్..
కాగా మరో ఘటనలో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న అవినీషను కేశ్వపుర పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.1.78 లక్షల విలువ చేసే 2.968 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా సాగిస్తున్నాడన్న విశ్వసనీయ సమాచారం మేరకు కేశ్వపుర పోలీసులు పెట్రోలింగ్ చేసే సందర్బంగా అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేపట్టారు.
ఆక్రమణల తొలగింపు సరికాదు
● మాజీ మంత్రి శ్రీరాములు
సాక్షి, బళ్లారి: ప్రభుత్వ స్థలాల్లో పేదలు ఇళ్లు, గుడిసెలు కట్టుకుని జీవనం సాగిస్తున్న తరణంలో అకస్మాత్తుగా వాటిని తొలగించడం సరికాదని మాజీ మంత్రి శ్రీరాములు పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని భత్రీ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. మహానగర పాలికె ఆధ్వర్యంలో రెండు రోజులుగా కొనసాగుతున్న అక్రమణల తొలగింపుపై పులువురు పేదలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయడం తాము కూడా సహించేది లేదని.. అయితే వాటిని ఎలా తొలగించాలన్న దానిపై పాలికె ఆలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆక్రమణల తొలగింపును వ్యతిరేకిస్తునట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించి బాధితుల తరఫున పోరాటం చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
అనధీకృత నర్సరీలపై
చర్యలు తీసుకోవాలి
కోలారు: హార్టికల్చర్ పంటలను బాధిస్తున్న రోగాల నియంత్రణకు, విత్తనాల నాణ్యత పరిశీలన చేయడానికి విశేష బృందాన్ని ఏర్పాటు చేయాలి. అనధీకృత నర్సరీలపై చర్యలు తీసుకోవాలని రైతు సంఘం పదాధికారులు శుక్రవారం హార్టికల్చర్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శివకుమారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.నారాయణ గౌడ మాట్లాడుతూ.. ఏటా టమాట సీజన్ ప్రారంభమైన సమయంలో హార్టికల్చర్ శాఖ వేల సంఖ్యలో కంపెనీలు, మందుల దుకాణాలు, నర్సరీల యజమానులతో కుమ్మకై ్క నకిలీ, విత్తనాలు, మందులను విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఏ కంపెనీ అయినా తమ కొత్త ఉత్పత్తులను మార్కెట్ చేయడానికి ముందు సంబంధిత శాఖ దృష్టికి తీసుకు రావాలన్నారు. కంపెనీ తానే స్వయంగా రెండు ఎకరాల విస్తీర్ణంలో పంట పండించి ఫలితం చూసిన తరువాత మార్కెట్‌లోకి తీసుకు రావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఈకంబళ్లి మంజునాథ్, మంగసంద్ర తమ్మణ్ణ, మునికృష్ణ, మంజునాథ్ పాల్గొన్నారు.
జిల్లా స్థాయి టాపర్‌కు సన్మానం
హోసూరు: ఇటీవల విడుదలైన సీబీఎస్‌ఈ పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో హోసూరు అద్వైత్ ఇంటర్నేషనల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని లలిత జిల్లా స్థాయి టాపర్‌గా నిలిచింది. 500 మార్కులకు గాను 496 మార్కులు సాధించింది. శుక్రవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థిని కే.లలితను అభినందించారు. పాఠశాల చైర్మన్ అశ్వత్‌నారాయణ రూ.20 లక్షల ప్రోత్సాహక నిధిని అందజేశారు. విద్యార్థులను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో 2012 నుంచి ప్రోత్సాహక నిధిని అందజేస్తున్నామన్నారు.


