సిద్దరామయ్యకు ఎదురుగాలి! | - | Sakshi
Sakshi News home page

సిద్దరామయ్యకు ఎదురుగాలి!

Apr 17 2026 11:20 AM | Updated on Apr 17 2026 11:20 AM

సాక్షి, బెంగళూరు: కొన్ని నెలలుగా కన్నడ కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్యమంత్రి కుర్చీ గురించి రగడ జరుగుతూనే ఉంది.. సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌ మధ్య పోరాటంతో ప్రభుత్వంలో, పార్టీలో వర్గాలు ఏర్పడ్డాయి. అంతఃకలహాలు అధికం కావడంతో ఆధిక్యం కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. కొన్నిరోజులుగా సీఎం సిద్ధరామయ్య శిబిరంపై దాడులు జరుగుతున్నాయి. పలువురు సిద్ధరామయ్య సన్నిహితులు పదవులు కోల్పోయేలా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ శిబిరం చేయగలిగింది. వరుస ఎదురుదెబ్బలతో సీఎం సిద్ధరామయ్య డైలమాలో పడిపోయారు.

రాజణ్ణ నుంచి షురూ

సీఎం ఆప్తుడు మంత్రి కేఎన్‌ రాజణ్ణ.. రాహుల్‌ గాంధీ మీద నోరు జారడంతో వెంటనే పదవి నుంచి తొలగించారు. దావణగెరె ఉప ఎన్నికలు వచ్చాక సిద్దరామయ్యకు ఎదురుగాలి అధికమైంది. అక్కడ తిరుగుబాటు అభ్యర్థికి మద్దతిచ్చారని సీఎం రాజకీయ కార్యదర్శి పదవి నుంచి నజీర్‌ అహ్మద్‌ సస్పెండ్‌, మైనారిటీ నేత అబ్దుల్‌ జబ్బార్‌ను పదవితో పాటు పార్టీ సభ్యత్వం నుంచి తీసేయడం కలకలానికి కారణమైంది. సిద్ధరామయ్య కూడా సన్నిహితులను కాపాడుకోవడానికి ఎక్కువ పోరాటం చేయడం లేదు. ఈ సమయంలో కేపీసీసీ చీఫ్‌గా డీకే శివకుమార్‌ పోరును తీవ్రం చేశారు.

వరుసగా సన్నిహితులకు ఉద్వాసన

పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారని చర్యలు

డీకే శివ వర్గంలో హుషారు

సీఎం మౌనంపై కుతూహలం

మునుముందు తీవ్రతరం?

భవిష్యత్తులో మరింత మంది సిద్ధరామయ్య వర్గీయులకు ఎదురు దెబ్బలు తగిలినా ఆశ్చర్యం లేదని తెలుస్తోంది. నోటీసులు, క్రమశిక్షణ చర్యల హెచ్చరికలు కాకుండా నేరుగా పదవి నుంచి తప్పించే ప్రయత్నాలు కొనసాగుతాయని తెలుస్తోంది. తాను ముఖ్యమైన పదవిలో ఉండడంతో పాటు పార్టీ పరిమితుల దృష్ట్యా సిద్ధరామయ్య మౌనం వహిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు తన పదవిని కాపాడుకోవడం చాలా ముఖ్యమని సిద్ధరామయ్య భావిస్తున్నట్లు పలువురు సీనియర్లు పేర్కొన్నారు. త్వరలో బెంగళూరుకు ఓ చెందిన ఓ మంత్రిని కూడా పార్టీ హైకమాండ్‌ తప్పించవచ్చని జోరుగా ప్రచారం సాగుతోంది. మునుముందు ఏం జరుగుతుందనేది సస్పెన్స్‌గా ఉంది. బెంగళూరు విమానాశ్రయంతో ప్రధాని మోదీ, సిద్దరామయ్య చెవిలో మంతనాలు జరపడం దేనికి సంకేతమని తీవ్ర చర్చనీయాంశమైంది.

Advertisement
 
Advertisement
Advertisement