కోలారు: కనీస వేతనంతో పాటు ఇతర డిమాండ్ల సాధన కోసం గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గురువారం జెడ్పీ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఉద్యోగులకు కనీస వేతనాలను అందించాలన్నారు. అన్ని గ్రామ పంచాయతీలకు సెకండరీ గ్రేడ్ గుమాస్తాలను నియమించి, పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రాట్యుటీ పరిహారాన్ని 90 రోజులకు పెంచాలని కోరారు. ఆదాయానికి అనుగుణంగా పన్ను వసూళ్లకు సిబ్బందిని నియమించాలని సూచించారు. ఐదేళ్ల పాటు వరుసగా సేవలు అందించిన వారికి బిల్ కలెక్టర్లుగా ప్రమోషన్ ఇవ్వాలన్నారు. అనంతరం జెడ్పీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు గాంధీనగర నారాయణ స్వామి, అధ్యక్షుడు అమర నారాయణ, కార్యదర్శి శివకుమార్, సమన్వయ కార్యదర్శి విజయకృష్ణ, వివిధ తాలూకాల పదాధికారులు పాల్గొన్నారు.


