భల్లూకం దాడిలో రైతుకు తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

భల్లూకం దాడిలో రైతుకు తీవ్ర గాయాలు

Apr 17 2026 11:14 AM | Updated on Apr 17 2026 11:14 AM

హొసపేటె: తన పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా రైతుపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన గురువారం కమలాపుర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. విజయనగర జిల్లా బుక్కసాగర గ్రామం దాటిన తర్వాత ఆనెగుంది వంతెన సమీపంలో జరిగిన ఈ దాడిలో రైతు చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఎలుగుబంటి దాడికి గురైన రైతును రాజశేఖర్‌గౌడ (50)గా గుర్తించారు. ఎప్పటిలానే తన పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా పొదల్లో దాగి ఉన్న ఒక ఎలుగుబంటి రైతుపై ఒక్కసారిగా దాడి చేసింది. ఈ దాడిలో అతని కుడి చేతికి, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన రైతును చికిత్స నిమిత్తం హొసపేటె తాలూకా ఆస్పత్రిలో చేర్పించారు.

దొంగ పట్టివేత

హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని కానాహొసహళ్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల మంగాపుర గ్రామంలో గత సంవత్సరం నవంబర్‌ 13న ఒక ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో గురువారం నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు మంగాపుర గ్రామానికి చెందిన పీ.నజీర్‌ షఫీ అని గుర్తించారు. అతని వద్ద నుంచి రూ.1.90 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కృషి చేసిన సిబ్బందిని ఎస్పీ జాహ్నవి, ఏఎస్పీ మంజునాథ్‌, డీఎస్పీ మల్లేష్‌ దొడ్డమని అభినందించారు.

అక్రమ రేషన్‌ బియ్యం పట్టివేత

హొసపేటె: హొసపేటె నగర శివార్లలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యం నిల్వపై పోలీసులు దాడి చేసి, స్వాధీనం చేసుకున్న ఘటన గురువారం జరిగింది. నగరంలోని సండూరు రోడ్డులో ఉన్న ఎల్‌ఎఫ్‌ఎస్‌ పాఠశాల పక్కన ఉన్న బహిరంగ స్థలంలో కొందరు వ్యక్తులు అక్రమంగా రేషన్‌ బియ్యాన్ని నిల్వ ఉంచి, తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారని స్థానికులు ఇచ్చిన సమాచారం ఆధారంగా హొసపేటె ఆహార తనిఖీ అధికారులు, ఎక్స్‌టెన్షన్‌ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది దాడి చేశారు. అక్కడ నాలుగు చక్రాల సరుకు రవాణా వాహనంలో నిల్వ ఉంచిన 36 బస్తాల నుంచి 1,368 కిలోల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యం విలువ రూ.30,944 ఉంటుందని అంచనా వేశారు. బియ్యం రవాణా కోసం వాడిన వాహనాన్ని కూడా పోలీసులు సీజ్‌ చేశారు. ఈ ఘటనపై ఎక్స్‌టెన్షన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

సర్కిళ్ల వద్ద నిలువ నీడ కల్పించరూ

రాయచూరు రూరల్‌: రాయచూరులో రోజురోజుకు ఉష్ణోగ్రతలు అధికం అవుతుండడంతో ప్రజలకు నిలువ నీడ కోసం పచ్చని పరదాల రక్షణ కల్పించాలని ఏఐడీవైఓ డిమాండ్‌ చేసింది. గురువారం అసిస్టెంట్‌ కమిషనర్‌ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంఘం అధ్యక్షుడు చెన్నబసవ మాట్లాడారు. బసవేశ్వర గంజ్‌, అంబేడ్కర్‌ సర్కిల్‌, రైల్వే స్టేషన్‌, ఆర్టీఓ సర్కిల్‌ సమీపంలోని ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద 180 సెకండ్ల పాటు వాహనదారులు ఎండలో నిలబడడం కష్టకరమని, ఆ ప్రాంతాల్లో నిలువ నీడకు రక్షణ కవచాలను ఏర్పాటు చేయాలని కోరుతూ అధికారికి వినతిపత్రం సమర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement