బళ్లారిఅర్బన్: మాదవ ద్రవ్యాల వినియోగంపై కట్టడి చర్యల్లో భాగంగా బళ్లారిలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సుమన డీ.పన్నేకర్ తెలిపారు. గత నెల 27 నుంచి ఏప్రిల్ 14 వరకు ప్రతి రోజు సాయంత్రం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు డ్రగ్స్ సేవించే వారిని గుర్తించేందుకు ప్రత్యేక గస్తీ నిర్వహించామన్నారు. ఈ చర్యల్లో భాగంగా మొత్తం 766 మందిని తనిఖీ చేసి వారిలో 63 మందిని వైద్య పరీక్షలకు పంపించామన్నారు. పరీక్షల్లో ఇద్దరు మాదవద్రవ్యాలు సేవించినట్లు నిర్ధారణ కావడంతో వారిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మిగిలిన 762 మందిపై అనుమానాస్పదంగా సంచరించినందుకు కర్ణాటక పోలీస్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
నారీ శక్తి వందన్
బిల్లుపై ప్రచార జాతా
రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ సర్కార్ లోక్‌సభలో నారీ శక్తి వందన్ బిల్లుకు ఆమోదం తెలపడంపై బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ప్రచార జాతాను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా కార్యదర్శి సుగుణ వెల్లడించారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్లమెంట్ ఉభయ సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేస్తున్న నారీ శక్తి వందన్ బిల్లును పాస్ చేయాలని కోరుతూ దేశ వ్యాప్తంగా అభియాన్ ర్యాలీ చేపట్టామన్నారు. ఈ సందర్భంగా సుమా, అశ్విని, ఆదిలక్ష్మిలున్నారు.
రిటైరైన అటెండర్‌కు ఘనసన్మానం
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే ప్రతి ఒక్కరూ పదవీ విరమణ చేయడం సహజం. అటెండర్ పదవీ విరమణ చేయడంతో ఉన్నత హోదాలో ఉన్న అసిస్టెంట్ కమిషనర్ సన్మానించిన ఘటన గంగావతిలో జరిగింది. బుధవారం సాయంత్రం కనకగిరి తాలూకా పంచాయతీ కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న రహీం సాబ్ పదవీ విరమణ చేశారు. వీడ్కోలు కార్యక్రమానికి విచ్చేసిన మైసూరు జిల్లా హుణసూరు అసిస్టెంట్ కమిషనర్ కావ్యరాణి ఆయనను ఘనంగా సన్మానించారు.
ఎమ్మెల్యే కుమారునికి సన్మానం
హొసపేటె: నగరంలోని 20వ వార్డులో ఆధునిక వసతులలో నిర్మించిన సరికొత్త డూప్లెక్స్ తరహా అంగన్‌వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే గవియప్ప కుమారుడు, సామాజిక కార్యకర్త హెచ్‌జీ విరుపాక్ష గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లల సమగ్ర వికాసంలో ఇలాంటి అత్యాధునిక వసతులు కలిగిన కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను సత్పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు. నగరంలో ఏర్పాటైన రెండో డూప్లెక్స్ తరహా అంగన్‌వాడీ కేంద్రం స్థానికుల దృష్టిని విశేషంగా ఆకర్షించింది. వార్డు కౌన్సిలర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


