యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా | - | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

Apr 16 2026 11:59 AM | Updated on Apr 16 2026 11:59 AM

రాయచూరు రూరల్‌: కళ్యాణ కర్ణాటక(క–క)లోని రాయచూరు, కలబుర్గి, యాదగిరి జిల్లాల్లో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ ఇసుక రవాణాపై అధికారులు, ప్రజా ప్రతినిధులు నోరు మెదపడం లేదు. జిల్లాలో తుంగభద్ర, కృష్ణ నదీ తీరాల్లో ఉన్న గ్రామాల్లో రోజుకు వందలాది టిప్పర్ల ద్వారా ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. జిల్లాలోని మాన్వి, రాయచూరు, దేవదుర్గ, యాదగిరి జిల్లా సురపురతో పాటు యాదగిరి తాలూకాలో కూడా అక్రమంగా ఇసుక రవాణా నేటికీ సాగుతోంది. జోళదడగి, కరిహళ్లి, పర్వతాపురల్లో కాంట్రాక్టర్లు పీఎల్‌.కాంబ్లి, పంచాక్షరి, శివప్ప బసప్ప, ఆనంద్‌ దొడ్డమనిలు స్టాక్‌ యార్డులకు నది నుంచి ఇసుకను దొంగచాటుగా తరలించి నిల్వ చేసి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని పోరాట సమితి నేతలు, సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

నదిలో గోతులు పడేలా తవ్వకాలు

పట్టపగలే నదిలో నుంచి పొక్లెయినర్ల ద్వారా గోతులు పడే విధంగా ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. రాయల్టీని కొన్ని వాహనాలకు పొంది మిగిలిన వాహనాలకు లేకుండా వందల కొద్ది టన్నుల ఇసుకను రవాణా చేస్తున్నారు. కొంత మంది కాంట్రాక్టర్లు నేరుగా ఇసుకను తరలిస్తుండటంతో రూ.కోట్లాది మేర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో కోత పడుతోంది. ఈ విషయంలో జిల్లాధికారి, ఎస్పీ, తహసీల్దార్లు మౌనం వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ సభ్యుల కుటుంబ సభ్యులు ఈ వ్యవహారంలో కుమ్మక్కు కావడంతో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాతో భవిష్యత్తులో నదులు కనుమరుగవుతాయనే భయాందోళన ప్రజల్లో ఉంది.

పోలీస్‌ సిబ్బందిపై మాఫియా దాడి

అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న వాహనాలను అడ్డుకున్న పోలీస్‌ కానిస్టేబుల్‌పై దాడి జరిగిన ఘటన మాన్వి తాలూకాలో జరిగింది. ఇటీవల చీకలపర్వి వద్ద నుంచి తుంగభద్ర నదీ తీరంలో నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా అడ్డుకోబోయిన పోలీస్‌ కానిస్టేబుల్‌పై ఇసుక మాఫియా దాడి చేసింది. ఈనేపథ్యంలో హైదరాబాద్‌ కర్ణాటక పోరాట సమితి నేత రాఘవేంద్ర కుష్టిగి సభ్యులతో కలిసి ఇటీవల వివిధ చోట్ల అక్రమ ఇసుక నిల్వలను పరిశీలించారు.

ఇసుక నిల్వను పరిశీలిస్తున్న పోరాట సమితి నేతలు

ఇసుక రవాణా కోసం నదిలో బారులు తీరిన టిప్పర్లు

నోరు మెదపని నేతలు, అధికారులు

క.క.లో ఇసుక దందాకు కళ్లెం పడేనా?

Advertisement
 
Advertisement
Advertisement