సర్‌ను నిరసిస్తూ లేఖల ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

సర్‌ను నిరసిస్తూ లేఖల ఉద్యమం

Apr 16 2026 11:59 AM | Updated on Apr 16 2026 11:59 AM

రాయచూరు రూరల్‌: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నా ఓటు నా హక్కు ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌–సర్‌)ను తిరస్కరించాలని ఏఐసీసీటీయూ డిమాండ్‌ చేసింది. బుధవారం రాయచూరులోని ప్రధాన తపాలా కార్యాలయం వద్ద సంఘం అధ్యక్షుడు అజీజ్‌ మాట్లాడారు. ప్రత్యేకంగా ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంలో కర్ణాటకలో జరుగుతున్న జనాభా గణన సర్వేను పారదర్శకంగా చేయాలన్నారు. దేశంలోని 10 రాష్ట్రాల్లో, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో లక్షలాది మంది పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించారని గుర్తు చేశారు. సర్‌ ద్వారా బిహార్‌లో 65 లక్షలు, పశ్చిమ బెంగాల్‌లో 91 లక్షలు, తమిళనాడులో 74 లక్షల మంది ఓటర్ల పేర్లు జాబితాల నుంచి తొలగించారని ఆరోపించారు. కర్ణాటకలో ఓటర్ల మ్యాపింగ్‌ ప్రక్రియకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. మహిళలు, వలస వెళ్లిన వారు, నిరాశ్రితులు, మైనార్టీలు, బుడగ సముదాయాలను ఓటర్ల జాబితా నుంచి దూరంగా ఉంచడానికి సర్‌ను అమలులో పెట్టిందని, దానిని తిరస్కరించాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖల ద్వారా వినతిపత్రాలను పోస్టు చేశారు.

ఉపాధ్యాయ పోస్టులు

భర్తీ చేయరూ.!

రాయచూరు రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న 62,420 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి వేదిక డిమాండ్‌ చేసింది. బుధవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో వేదిక సంచాలకురాలు విద్యా పాటిల్‌ మాట్లాడారు. పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, గ్రంథాలయం, క్రీడా మైదానం, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మూడో తరగతి చదివే వరకు అక్కడే పాఠశాలలు అందుబాటులో ఉండాలన్నారు. కేపీఎస్‌, మ్యాగ్నెట్‌ పాఠశాల గుర్తింపును నిలిపి వేయాలని, ఆర్టీఈ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు రాసిన వినతిపత్రాన్ని అదనపు జిల్లాధికారి శివానందకు సమర్పించారు.

నారీ శక్తి వందన్‌ బిల్లుకు ఆమోదంపై అభియాన్‌

రాయచూరు రూరల్‌: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లోక్‌సభలో నారీ శక్తి వందన్‌ బిల్లుకు ఆమోదం తెలపడంపై బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో అభియాన్‌ చేపట్టారు. బుధవారం నందీశ్వర ఆలయం వద్ద నుంచి చేపట్టిన ర్యాలీని జిల్లా సంచాలకురాలు శరణమ్మ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పార్లమెంట్‌ ఉభయ సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ నారీ శక్తి వందన్‌ బిల్లు పాస్‌ కావడంతో అభియాన్‌ ర్యాలీ చేపట్టామన్నారు. ఈ సందర్భంగా సుమ, వాణి, సులోచన, సంగీత, సుమతీ శాస్త్రిలున్నారు.

బలహీన వర్గాల అభివృద్ధి ప్రదాత అంబేడ్కర్‌

రాయచూరు రూరల్‌: బడుగు, బలహీన వర్గాలను దృష్టిలో ఉంచుకొని వారి అభివృద్ధిని కాంక్షించిన వ్యక్తి అంబేడ్కర్‌ అని ఎల్‌ఐసీ సీనియర్‌ డివిజనల్‌ మేనేజర్‌ ప్రసాద్‌ బసవరాజ్‌ పేర్కొన్నారు. ఎల్‌ఐసీ డివిజనల్‌ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బుద్దిస్ట్‌ సంఘం ఆధ్వర్యంలో 135వ అంబేడ్కర్‌ జయంతిని ప్రారంభించి ఆయన మాట్లాడారు. దేశాభివృద్ధే లక్ష్యంగా పని చేశారన్నారు. దేశ రక్షణ రంగం నుంచి ఆర్థిక రంగం వరకు పురోభివృద్ధి సాధించిందన్నారు. సమావేశంలో చిరంజీవి, తిమ్మప్ప, జిల్లాధ్యక్షుడు నారాయణ, రాఘవేంద్ర ఘంటా, శ్రీనివాస్‌, నరసింహులు, గోవిందమ్మ, నాగవేణి, గోవిందరాజు, ప్రశాంత్‌, మహేష్‌బాబు తదితరులున్నారు.

వ్యక్తి ఆత్మహత్య

కోలారు: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ముళబాగిలు తాలూకా అరహళ్లిలో జరిగింది. అరహళ్లి గ్రామానికి చెందిన మహేష్‌ (42) కుటుంబ కలహాల వల్ల గ్రామ సమీపంలో ని చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ముళబాగిలు రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement