రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా జేగరకల్‌లో కక్కల్ ద్యావమ్మ దేవి రథోత్సవం వైభవంగా జరిగింది. మంగళవారం రాత్రి వందలాది మంది భక్తుల సమక్షంలో రథాన్ని లాగారు. జేగరకల్‌లో వెలసిన దేవికి ప్రత్యేక పూజలను కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య, సోమవారపేటె మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్య, కృష్ణప్ప నెరవేర్చారు. రథోత్సవంలో మాజీ ఎమ్మెల్యే తిప్పరాజ్ హవల్దార్, మహదేవ్, రాయచూరు, మాన్వి, సింధనూరు, కొప్పళ, బళ్లారి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నవలగుందలో గడ్డివాముల దగ్ధం
హుబ్లీ: ధార్వాడ జిల్లాలోని నవలగుంద పట్టణంలో పొట్టు, గడ్డి నిల్వ చేసిన వాముకు ఆకస్మికంగా మంటలు తగిలి అపార నష్టం సంభవించింది. పట్టణంలోని మహబూబ్‌నగర్ కల్లిమఠ వీధి ప్రగతిశీల రైతు మల్లప్పకు చెందిన గడ్డివాములు దగ్ధం అయ్యాయి. ముందుగా వాముల్లో పొగ రావడం గమనించిన స్థానికులు మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. అయినా మంటలు అదుపులోకి రాకపోవడంతో పురసభ సిబ్బంది అగ్నిమాపక దళానికి తెలపడంతో వారు తక్షణమే వచ్చి మంటలను ఆర్పారు. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే కోనరెడ్డి అధికారులతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించి నష్టపోయిన రైతన్నను ఓదార్చారు. ప్రభుత్వం నుంచి తగిన పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. తహసీల్దార్ సుధీర్, పురసభ ముఖ్యాధికారి శరణప్ప పూజార్ పాల్గొన్నారు.
ధార్వాడలో రెచ్చిపోయిన ఆకతాయిలు
హుబ్లీ: ఇంటిపై రాళ్లు రువ్వడమే కాకుండా ఇంటి ముందు నిలిపిన బైక్‌లకు నిప్పుపెట్టిన ఘటన ధార్వాడలోని మహబూబ్ నగర్‌లో చోటు చేసుకుంది. దుండగుల ఈ అకృత్యానికి రెండు బైక్‌లు పూర్తిగా దగ్ధమై రూ.లక్షలాది మేర నష్టం వాటిల్లింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీ టీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుల ఆచూకీ కోసం తీవ్రంగా గాలింపు ప్రారంభించారు.
డీసీఆర్‌ఈ డీఎస్పీగా బాధ్యతల స్వీకారం
హొసపేటె: విజయనగర జిల్లాలోని పౌర హక్కుల అమలు డైరెక్టరేట్ (డీసీఆర్‌ఈ) పోలీస్ స్టేషన్‌కు మొదటి డీఎస్పీగా విశ్వనాథ్‌రావు కులకర్ణి బాధ్యతలు స్వీకరించారు. హొసపేటెలోని కాలేజీ రోడ్డులో పని చేస్తున్న డీసీఆర్‌ఈ పోలీస్ స్టేషన్‌లో ఆయన అధికారికంగా బాధ్యతలను చేపట్టారు. విజయనగర జిల్లాలోని డీసీఆర్‌ఈ విభాగానికి ఒక అధికారి డీఎస్పీగా నియమితులవడం ఇదే మొదటి సారి. విశ్వనాథ్ రావు కులకర్ణి గతంలో హొసపేటె ఉపవిభాగంలోని హునగుందలో డీఎస్పీగా సేవలందించారు. ఆయనకు ఈ రంగంలో మంచి అనుభవం ఉంది. ఆయన పరిపాలన సామర్థ్యం, శాంతిభద్రతల అమలులో ఉన్న నైపుణ్యం, పౌరహక్కుల పరిరక్షణకు, ఫిర్యాదుల సమర్థవంతమైన పరిష్కారానికి ఎంతో దోహద పడుతుందని భావిస్తున్నారు. డీసీఆర్‌ఈ పోలీస్ స్టేషన్ పని తీరును మరింత బలోపేతం చేయడానికి, ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి ఆయన తగిన చర్యలు తీసుకుంటారని ప్రజలు ఆశిస్తున్నారు.
పౌష్టికాహార సేవనం తప్పనిసరి
రాయచూరు రూరల్: జిల్లాలో గర్భిణులు, బాలింతలు మృతి చెందుతున్న నేపథ్యంలో పౌష్టికాహారం సేవించాలని జిల్లా ఆరోగ్య అధికారిణి నందిత పేర్కొన్నారు. బుధవారం దేవదుర్గ తాలూకా కరిగుడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గర్భిణులు, బాలింతలను పరీక్షించి వారికి సలహాలు ఇచ్చారు. బాలింతల మరణాలు సంభవిస్తున్న తరుణంలో గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించాలని వైద్యులకు, అధికారులకు, ఆశా కార్యకర్తలకు, సిబ్బందికి సూచించారు. గ్రామాల్లో పారిశుధ్యం లోపంపై జీపీ అధికారులకు పలు సూచనలు చేశారు.


