ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై కొరడా | - | Sakshi
Sakshi News home page

ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై కొరడా

Apr 16 2026 11:59 AM | Updated on Apr 16 2026 11:59 AM

సాక్షి బళ్లారి: నగరంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు తోడు వాహనాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ సమస్య జటిలంగా మారింది. ముఖ్యంగా బెంగళూరు రోడ్డు అంటేనే ట్రాఫిక్‌తో రోడ్డు నిండిపోయేది. నిత్యం వేలాది వాహనాలు, జనం తిరిగే రోడ్డులో ఫుట్‌పాత్‌ ఆక్రమణలు కూడా పెరిగిపోయాయి. బెంగళూరు రోడ్డులో రాయల్‌ సర్కిల్‌ నుంచి నటరాజ్‌ థియేటర్‌ ఎదుట అటు వైపు ఇటు మీనాక్షి సర్కిల్‌, బ్రూస్‌పేట్‌ రోడ్డు, ఏపీఎంసీ వరకు ఫుట్‌పాత్‌లపై చిరు వ్యాపారుల అంగళ్లు, హోటళ్లు విచ్చలవిడిగా వెలిశాయి. ఈనేపథ్యంలో ట్రాఫిక్‌ సమస్య నివారణకు, ఫుట్‌పాత్‌ ఆక్రమణల తొలగింపునకు బుధవారం సిటీ కార్పొరేషన్‌ అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులు సంయుక్తంగా నడుం బిగించారు. రాయల్‌ సర్కిల్‌ నుంచి ఏపీఎంసీ వరకు ఫుట్‌పాత్‌పై ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టారు. సిటీ కార్పొరేషన్‌ జోనల్‌ అధికారులు గురురాజ్‌, శ్రీనాథ్‌, ట్రాఫిక్‌ సీఐ, ఎస్‌ఐలు, అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో మోహరించి ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలు తొలగించారు. చిన్న చిన్న హోటళ్లు, అంగళ్లు, తోపుడుబండ్లను యంత్రాలతో, జేసీబీలతో, ట్రాక్టర్లతో, మనుషులతో ఖాళీ చేయించారు. రాయల్‌ సర్కిల్‌ నుంచి ఏపీఎంసీ వరకు పెద్ద ఎత్తున ఆక్రమణలు చేసుకొన్న నేపథ్యంలో సగానికి పైగా తొలగించామని, పూర్తి స్థాయిలో ఆక్రమణలన్నింటిని తొలగించి పాదచారులకు ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా గట్టి చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. వాహనదారులు, పాదచారుల నుంచి పలు మార్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఎట్టకేలకు ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై చర్యలు తీసుకోవడంతో నగర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆక్రమణల తొలగింపు చర్యలు మరో రెండు రోజుల పాటు కొనసాగుతాయని సిటీ కార్పొరేషన్‌ అధికారులు పేర్కొన్నారు.

రాయల్‌ సర్కిల్‌ నుంచి

ఏపీఎంసీ వరకు తొలగింపు

నగరంలో ట్రాఫిక్‌ సమస్య

నివారణకు పకడ్బందీ చర్యలు

కార్పొరేషన్‌ అధికారులు, పోలీసుల సంయుక్త కార్యాచరణ

Advertisement
 
Advertisement
Advertisement