కోలారు: నగరంలోని ఎస్‌ఎన్‌ఆర్ జిల్లా ఆస్పత్రిలో పశువులకు, ప్రాణులకు రక్త పరీక్షలను నిర్వహిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. కుక్కలు, పిల్లులతో పాటు వివిధ జంతువులకు రక్త పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిసింది. జిల్లా ఆస్పత్రి ల్యాబొరేటరీ జాతీయ ఆరోగ్య అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగి బీ.రాఘవేంద్రపై ఆస్పత్రి ఇతర సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పెంపుడు జంతువులు, పశువులను పెంచుతున్న వారి ఇళ్లకు వెళుతున్న రాఘవేంద్ర ప్రాణుల రక్త నమూనాలను సేకరించి ఆస్పత్రి ల్యాబొరేటరీలో పరీక్షలను నిర్వహిస్తున్నారని ఆస్పత్రి సిబ్బంది ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. జనవరి 22న ఆస్పత్రి సిబ్బంది సర్జన్ డాక్టర్ జగదీష్‌కు ఫిర్యాదు చేశారు. ప్రాణుల రక్త పరీక్షలను నిర్వహిస్తుండడం వల్ల ల్యాబొరేటరీలో యంత్రోపకరణాల నిర్వహణ కూడా సరిగా లేదని, స్వచ్ఛతను కాపాడడం లేదని యంత్రాల నిర్వహణ బాధ్యతలను చూస్తున్న సంస్థ కూడా నివేదికను అందించింది. దీంతో ఈ ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఆరోగ్య అధికారి శ్రీనివాస్ జెడ్పీ సీఈఓకు మార్చి 25న సిఫార్సు చేసినట్లు సర్జన్ జగదీష్ తెలిపారు.
వేటుకు పైఅధికారులకు సిఫార్సు
విధి నిర్వహణలో లోపానికి పాల్పడిన రాఘవేంద్ర ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్టు ఉద్యోగి కావడం వల్ల తాను చర్యలు తీసుకోలేనని, అందుకే ఉన్నతాధికారులకు సిఫార్సు చేసినట్లు తెలిపారు. ఉద్యోగి రాఘవేంద్ర ప్రాణుల రక్తపరీక్షలను ఇక్కడ ఎందుకు చేస్తున్నారనే విషయం పరిశీలనలో తెలియాల్సి ఉందన్నారు. జిల్లా పశు సంవర్ధక శాఖలో పశువుల కోసం ప్రత్యేక ల్యాబోరేటరీ ఉంది. జిల్లా పాలి క్లినిక్ కూడా ఉంది. అక్కడ ఫీజులు చెల్లించి పరీక్షలను చేయించుకోవాలి. అయితే జిల్లా ఆస్పత్రి ల్యాబొరేటరి ఉద్యోగి రాఘవేంద్ర ఇళ్ల వద్దకే వెళ్లి ప్రాణుల రక్త నమూనాలు సేకరించి తక్కువ ఖర్చుతో పరీక్షలు నిర్వహించేవాడని తెలిసింది. మనుషుల రక్త పరీక్షలను నిర్వహించే ల్యాబొరేటరీలో కొన్ని ప్రాణుల రక్త పరీక్షలను కూడా నిర్వహించవచ్చని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఎస్‌ఎన్‌ఆర్ జిల్లా ఆస్పత్రిలో పలువురు రోగులకు రక్త పరీక్షలు చేయడానికి బయటకు చీటీలు రాసిస్తున్నారు. అయితే ప్రాణులు, పక్షులకు ఇక్కడే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇది ఆస్పత్రిలోని అవ్యవస్థకు అద్దం పడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు.
ఘటనపై జిల్లాధికారి మండిపాటు
ఎస్‌ఎన్‌ఆర్ ఆస్పత్రి ఘటన విషయం తెలియగానే జిల్లాధికారి ఎంఆర్ రవి సీరియస్ అయ్యారు. ల్యాబొరేటరి కాంట్రాక్టు ఉద్యోగి రాఘవేంద్రను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని జిల్లా ఆరోగ్య శాఖ అధికారి శ్రీనివాస్‌కు సూచించారు. జిల్లాధికారి ఆదేశాలతో ఆరోగ్య అధికారి కాంట్రాక్టు ఉద్యోగి రాఘవేంద్రను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు చేశారు.
ల్యాబ్‌లో పరీక్షలపై సిబ్బంది ఫిర్యాదు
శుభ్రతాలోపంపై సంస్థ నివేదిక సమర్పణ


