హొసపేటె: కారు ప్రమాదంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ దుర్మరణం చెందారు. విజయనగర, కొప్పళ జిల్లాల్లో డీసీఆర్‌ఈ యూనిట్ సీఐగా పని చేస్తున్న రఘునాథ్ మృతుడు. బుధవారం విజయనగర, దావణగెరె జిల్లాల సరిహద్దులోని ముస్టూరు– కడబనకట్టె గ్రామాల మధ్య ఈ ప్రమాదం జరిగింది. ఆయన ఒక్కరే కారును నడుపుకొంటూ వస్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కనున్న వేప చెట్టును ఢీకొట్టడంతో తీవ్ర గాయాలతో అక్కడే మరణించారు. ఆయనను ఇటీవల వెంటనే బెంగళూరులోని ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. త్వరలోనే వెళ్లడానికి సిద్ధమవుతుండగా ప్రమాదంలో చనిపోయారు.
క్వాంటమ్ రంగంలో
కర్ణాటక ముందంజ
శివాజీనగర: విశ్వ క్వాంటమ్ దినాచరణ నేపథ్యంలో బుధవారం కర్ణాటక రాష్ట్ర సమగ్ర క్వాంటమ్ ఎకో సిస్టమ్ మ్యాప్‌ను ఆవిష్కరించడం ద్వారా దేశంలో ఇటువంటిది సాధించిన తొలి రాష్ట్రంగా కర్ణాటక నిలిచిందని చిన్న నీటి పారుదల, సైన్స్, సాంకేతిక పరిజ్ఞాన మంత్రి ఎన్,ఎస్.బోసురాజు తెలిపారు. బెంగళూరు నెహ్రూ ప్లానెటోరియంలో జరిగిన క్వాంటమ్ దినాచరణ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. క్వాంటమ్ సాంకేతిక రంగంలో కర్ణాటక చాలా అభివృద్ధి సాధించింది. దేశంలోను, ప్రపంచంలోనూ క్వాంటమ్ స్థానంగా విలసిల్లుతోందన్నారు. క్వాంటమ్ మార్గదర్శకాల దిశగా క్వాంటమ్ ఎకో సిస్టమ్ మ్యాప్‌ను ఆవిష్కరించామన్నారు. కార్యక్రమంలో ఐటీ–బీటీ మంత్రి ప్రియాంక ఖర్గే, ఇస్రో మాజీ అధ్యక్షుడు కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
టిప్పర్‌తో ఢీకొట్టి,
తుపాకీతో కాల్చి..
● విజయపుర జిల్లాలో జీపీ సభ్యుని హత్య
రాయచూరు రూరల్: రాష్ట్రంలో రాజకీయ నేతల హత్యలు తరచుగా జరుగుతున్నాయి. స్వతంత్ర జీపీ సభ్యుడు దారుణ హత్యకు గురైన ఘటన విజయపుర జిల్లాలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. నగర పరిధిలోని అలియాబాద్ పరిశ్రమల కేంద్రం వద్ద కొందరు దుండగులు పాంగురినదొడ్డి జీపీ సభ్యుడు రాజు కరె (48)ను కాల్చిచంపారు. రాజు జీపులో వెళుతుండగా టిప్పర్‌తో ఢీకొట్టించి, తరువాత ఆరుసార్లు తుపాకీ పేల్చి హత్య చేశారని ఎస్పీ లక్ష్మణ నింబర్గి తెలిపారు. హంతకుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. రాజు కరె రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంతో పాటు ద్రాక్ష తోటలు పెంచేవాడు. స్థిరాస్తి గొడవల్లో ప్రత్యర్థులే చంపి ఉంటారని అనుమానాలున్నాయి. ఘటనాస్థలిలో కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి.
ముగ్గురికి హైకోర్టు జడ్జిలుగా సిఫారసు
శివాజీనగర: రాష్ట్రంలో న్యాయాధికారులుగా పనిచేస్తున్న రాజేశ్వరి నారాయణ హెగ్డే, కదంబాడి గణేశ్ శాంతి, మహాదేవప్ప భృంగేశ్‌లకు హైకోర్టు జడ్జిలుగా పదోన్నతికి కల్పించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం తీర్మానించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని సిఫారసు చేయనుంది. కర్ణాటక హైకోర్టులో మొత్తం 62 మంది న్యాయమూర్తులు ఉండాలి, కానీ 45 మంది జడ్జిలే ఉన్నారు. మిగతా పోస్టులు ఖాళీగా ఉన్నాయి.


