యోగేశ్‌గౌడ హత్యకేసులో ఎమ్మెల్యే కులకర్ణి దోషి | - | Sakshi
Sakshi News home page

యోగేశ్‌గౌడ హత్యకేసులో ఎమ్మెల్యే కులకర్ణి దోషి

Apr 16 2026 10:24 AM | Updated on Apr 16 2026 10:24 AM

బనశంకరి: ధార్వాడ జెడ్పీ సభ్యుడు యోగేష్‌గౌడ హత్య కేసులో సస్పెన్స్‌ తొలగిపోయింది. 15వ నిందితుడిగా ఉన్న ధార్వాడ గ్రామీణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వినయ్‌ కులకర్ణితో సహా 17 మందిని దోషులుగా నిర్ధారిస్తూ బెంగళూరు ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు వెలువరించింది. వీరికి గురువారం శిక్ష ఖరారు కానుంది. అందరినీ కోర్టులో హజరుపరచాలని కోర్టు ఆదేశించింది. దీంతో సీబీఐ అధికారులు దోషులందరినీ అదుపులోకి తీసుకున్నారు.

భూ వివాదంతో హత్య

యోగేశ్‌గౌడ, వినయ్‌కులకర్ణి మధ్య తాలూకా పంచాయతీ పదవిపై గొడవ ఏర్పడింది. భూవివాదం కూడా ఉంది. ఈక్రమంలో 2016 జూన్‌ 10న యోగేశ్‌గౌడ హత్యకు గురయ్యాడు. యోగేశ్‌గౌడ కుటుంబ సభ్యుల డిమాండ్‌ మేరకు కేసును సీబీఐకి అప్పగించారు. సీబీఐ అధికారులు 113 మంది సాక్షులను విచారించి చార్జిషీట్‌ దాఖలు చేశారు. అప్పటినుంచి కోర్టులో విచారణ జరుగుతోంది. ఇటీవల విచారణ పూర్తి చేసి అంతిమ తీర్పు ఈనెల 15 తేదీ ప్రకటిస్తామని కోర్టు తెలిపింది. ఈమేరకు బుధవారం తీర్పును వెలువరించింది.

సీబీఐ ఏం చెప్పింది?

యోగేశ్‌గౌడ హత్యకేసులో ఎమ్మెల్యే వినయ్‌కులకర్ణికి ప్రధాన పాత్ర ఉందని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. 15వ ఆరోపిగా ఉన్న వినయ్‌ కులకర్ణి ఈ కేసులో 2020, 2025లో జైలుకెళ్లారు. బెయిల్‌పై విడుదలై 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ధార్వాడలో పోలీసు బందోబస్తు

తీర్పు అనంతరం ధార్వాడలో గొడవలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటైంది. దార్వాడలోని వినయ్‌కులకర్ణి నివాసం, ధార్వాడ నగర, గ్రామీణ ప్రాంతాల్లో పటిష్ట పోలీస్‌ భద్రత కల్పించారు.

ఎమ్మెల్యే పదవికి ముప్పు

యోగేశ్‌గౌడ హత్యకేసులో దోషిగా ఉన్న ఎమ్మెల్యే వినయ్‌కులకర్ణి ఎమ్మెల్యే పదవి కోల్పోయే అవకాశం ఉంది. రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తే ప్రజాప్రతినిధుల కోర్టు యాక్ట్‌ ప్రకారం వినయ్‌కులకర్ణి తక్షణం ఎమ్మెల్యే పదవి కోల్పోతారు. హైకోర్టుకు వెళ్లి శిక్షపై స్టే తెచ్చుకుంటే మళ్లీ ఎమ్మెల్యే పదవి లభించే అవకాశం ఉంది.

ఆయనతో సహా 17 మంది ఖరారు

తీర్పు వెలువరించిన బెంగళూరు

ప్రజాప్రతినిధుల కోర్టు

నేడు శిక్ష ఖరారు

Advertisement
 
Advertisement
Advertisement