వసతి గృహం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

వసతి గృహం ప్రారంభం

Apr 4 2026 7:31 AM | Updated on Apr 4 2026 7:31 AM

హొసపేటె: మాతృ శిశు ఆస్పత్రికి వచ్చే గర్భిణుల తల్లుల, వారి సంరక్షకులకు ఉచిత వసతి కోసం నిర్మించిన వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్‌ కవితా ఎస్‌.మన్నికేరి శుక్రవారం ప్రారంభించారు. వసతి గృహంలో మంచాలు, టాయిలెట్లు, తాగునీటి సౌకర్యాలు కల్పించారు. కార్యక్రమంలో బీఎంఏకు చెందిన గణేష్‌ హెగ్డే, జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్‌ ఎల్‌ఆర్‌.శంకర్‌ నాయక్‌, జిల్లా ఆర్‌సీహెచ్‌ అధికారి డాక్టర్‌ జంబయ్య, సర్జన్లు, ప్రోగ్రామ్‌ అధికారులు, సీనియర్‌ స్పెషలిస్ట్‌ వైద్య అధికారులు, సిబ్బంది సభ్యులు పాల్గొన్నారు.

యూట్యూబర్‌ ఆత్మహత్యాయత్నం

పోలీసుల వేధింపులే కారణమని వీడియో విడుదల

హుబ్లీ: పోలీస్‌ అధికారి వేధింపులకు విసిగిపోయిన ఓ యూట్యూబర్‌ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన బీదర్‌లో చోటు చేసుకుంది. యూట్యూబర్‌ సల్మాన్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి. బీదర్‌ జిల్లా ఎస్పీ ప్రదీప్‌ గుంటి తనను వేధింపులకు గురి చేస్తున్నారని బాధితుడు సల్మాన్‌ ఫేస్‌బుక్‌లో వీడియో పెట్టి కన్నీటి పర్యంతమయ్యాడు. శాంతి సమావేశం పేరుతో కార్యాలయానికి పిలిపించుకుని అందరి ఎదుట దాడి చేసి, ప్రాణం తీస్తానని బెదరించాడని వాపోయాడు. నీ యూట్యూబ్‌ చానల్‌ కొనసాగించరాదని బెదరించినట్లు తెలిపాడు. పోలీసుల వేధింపులు తాళలేక సల్మాన్‌ 12 నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్ర అస్వస్థతకు గురైన అతడిని బీదర్‌ బ్రిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

ఆకట్టుకున్న ఓటుహక్కు జాగృతి

బళ్లారి రూరల్‌: దావణగెరె జిల్లా స్వీప్‌ సమితి ఆధ్వర్యంలో ఓటుహక్కు వినియోగం జాగృతిలో భాగంగా శుక్రవారం రైల్వేస్టేషన్‌ ఆవరణలో మహిళలకు రంగోలి పోటీలు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన మహిళలు ఓటుహక్కుపై వివిధ రకాల ముగ్గులు వేశారు. నోటుకు ఓటును అమ్మవద్దు, మన ఓటు–మన హక్కు, దేశాభివృద్ధికి ఓటు, మత సామరస్యానికి ఓటు వినియోగం, సమైఖ్య భారతావనిలో ఓటుహక్కు, తదితర అర్థాలు వచ్చేలా వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.

మెట్ల పైనుంచి కిందపడి

యువకుడు మృతి

బళ్లారి రూరల్‌: బళ్లారి కొండ మెట్లు ఎక్కుతూ అదుపుతప్పి కిందపడటంతో తీవ్రంగా గాయపడిన యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. మృతుడి సంబంధీకులు తెలిపిన వివరాలు.. బళ్లారి కోట ప్రాంతానికి చెందిన రాకేష్‌(22) తాపీమేస్త్రిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఉదయం కొండ ఎక్కతుండగా చివరి మలుపు వద్ద అదుపుతప్పి కింద పడ్డాడు. అదే సమయంలో రాకేష్‌ ఎదపై రాయి పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం ట్రామాకేర్‌ సెంటర్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఈ ఘటనపై కౌల్‌బజార్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

చదరంగం పోటీలతో

ఏకాగ్రత మెరుగు

బళ్లారి అర్బన్‌: విద్యార్థుల్లో ఏకాగ్రత, నిర్ణయ సామర్థ్యాలను పెంపొందించడానికి చదరంగం (చెస్‌) పోటీలు ఉపయోగపడుతాయని పోలో హోటల్‌ ప్రవీణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక పోలో హోటల్‌ స్మిమింగ్‌పుల్‌ వద్ద ఉన్న సభాంగంణంలో అఖండ బళ్లారి జిల్లా చదరంగ పోటీలు–2026 నిర్వహించారు. బళ్లారి, విజయనగర జిల్లాలకు చెందిన సుమారు 134 మంది 15 సంవత్సరాల్లోపు విద్యార్థులు చదరంగం పోటీలకు హాజరయ్యారు. ప్రతిభ కనబరచిన 20 మందిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో వీఈఎస్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు కేవీ శెట్టి, బళ్లారి జిల్లా చెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ బీహెచ్‌ఎం వీరుపాయ్య, అంతర్జాతీయ అర్బిటర్‌ ఎం.బసవరాజు, ఎంఎస్‌జీ కంసల్టెండ్‌ ఎం.సిద్దరామన్న గౌడ, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ చెర్మన్‌ జేసీ రెడ్డి, జీజే ట్రస్ట్‌ అధ్యక్షుడు శరబయ్య స్వామి, టైగర్‌ హిల్స్‌ స్కూల్‌ అధ్యక్షుడు రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.

తాగునీటి కోసం ఆందోళన

రాయచూరు రూరల్‌: వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం యాపలదిన్ని పంచాయతీ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు, మంత్రులు స్పందించక పోవడంతో మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement