బస్టాండ్‌లో చైన్‌స్నాచింగ్‌ | - | Sakshi
Sakshi News home page

బస్టాండ్‌లో చైన్‌స్నాచింగ్‌

Mar 31 2026 7:32 AM | Updated on Mar 31 2026 7:32 AM

గుత్తి: స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో ఆదివారం రాత్రి చైన్‌స్నాచింగ్‌ జరిగింది. కర్ణాటకలోని బళ్లారి జిల్లా తోరణగల్లుకు చెందిన గౌతమి గుత్తిలోని బంధువుల ఇంట శుభకార్యానికి వచ్చింది. ఫంక్షన్‌ ముగించుకున్న అనంతరం ఆదివారం రాత్రి తిరుగు ప్రయాణమైన ఆమె బస్టాండ్‌కు చేరుకుని బస్సు ఎక్కుతున్న సమయంలో దుండగులు ఆమె మెడలోని మూడు తులాల బరువున్న బంగారు గొలుసు లాక్కొని ఉడాయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

జైలు నుంచి నిందితుడి బెదిరింపులు

హుబ్లీ: ధార్వాడ సెంట్రల్‌ జైలులో పోక్సో కేసు నిందితుడు మైనర్‌ బాలికకు నిత్యం వీడియో కాల్‌ చేసి వేధిస్తున్న ఘటన సర్వత్రా విమర్శలకు దారి తీసింది. ఆ నిందితుడు బాలికను బెదిరిస్తూ కోర్టులో తనకు మద్దతుగా మాట్లాడాలని డిమాండ్‌ చేస్తున్నాడు. అంతేగాక అతను తన చేతిపై బాధితురాలి పేరును రాసుకొని వీడియో కాల్‌ చేస్తున్నాడని తెలిసింది. ఈ ఘటన ద్వారా జైలులో మొబైల్‌ ఫోన్ల లభ్యత ఎంత సులభంగా ఉందో, వాటి వాడకం గురించి తీవ్రమైన ప్రశ్నలు తలెత్తాయి. పోలీస్‌ అధికారులేమో జైల్‌లో మొబైల్‌ ఫోన్లకు అవకాశం లేదని పదేపదే చెబుతున్నారు. ఈ తాజా ఘటన దీనికి విభిన్నంగా కనిపిస్తోంది. లవ్‌ జిహాద్‌ ఆరోపణలు తలెత్తిన ఈ కేసులో నిందితుడు బాలికపై నిత్యం వేధింపులకు పాల్పడుతుండటంతో బాధితురాలి కుటుంబం ఆవేదనతో రగిలి పోతుంది. జైలు అధికారుల సహకారం లేకుండా ఇలాంటి ఘటన జరగడం అసాధ్యం అని సదరు కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ తమకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు.

పట్టర పట్టు.. విజేతగా నిలిచేట్టు..

జాతరలో అలరించిన కుస్తీ పోటీలు

హుబ్లీ: హావేరిలోని ప్రముఖ పురసిద్దేశ్వర దేవర జాతర వేడుకలు సరికొత్త అనుభూతినిస్తూ ఘనంగా ముగిశాయి. ముఖ్యంగా ఈ సారి కుస్తీ పోటీలు అందరిని అలరించాయి. ప్రతి ఏటా ఉగాది నేపథ్యంలో జాతర మహోత్సవాలు, ఆ తర్వాత కుస్తీ పోటీలు అంతే ఆసక్తికరంగా ఏర్పాటు చేస్తారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ కుస్తీ పోటీల్లో వివిధ రకాల పట్టులతో క్రీడాకారులు అలరించారు. హావేరి హొసమని సిద్దప్ప మైదానంలో జరిగిన కుస్తీ పోటీల్లో విజేతలకు రూ.2000 బహుమతి, వెండి గదను ప్రదానం చేశారు. ఈ ఫైల్వాన్లు 10 నిమిషాలకు పైగా బరిలో పోరాడి ఎక్కువ సేపు ప్రత్యర్థులను తమ పట్టు సడలించకుండా బరిలో నిలిచారు. దీంతో ప్రేక్షకుల్లో ఎక్కడ లేని ఉత్సాహం రేకత్తి కేకలు, చప్పట్లు, ఈలలతో మైదానం దద్దరిల్లింది. బెళగావి, ధార్వాడ, దావణగెరె, చిత్రదుర్గ జిల్లాల నుంచి 150 మందికి పైగా ఫైల్వాన్లు పాల్గొన్నారు.

మట్కా బుక్కీలపై పోలీసు దాడి

రూ.19.44 లక్షల నగదు స్వాధీనం

ముగ్గురు అరెస్ట్‌, మొబైల్‌, బైక్‌ సీజ్‌

బళ్లారిఅర్బన్‌: నగరంలోని ఏపీఎంసీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మట్కా బుక్కీలపై పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. ఒక మొబైల్‌ ఫోన్‌, ఒక మోటార్‌ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. కాకర్లతోట హనుమాన్‌ నగర్‌లోని కోళ్ల ఫారం సమీపంలో మట్కా నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడి చేశారు. రూపనగుడి రోడ్డుకు చెందిన జీవీ.రామాంజినేయులు, మిల్లర్‌పేట్‌కు చెందిన నూర్‌ అలియాస్‌ నూర్‌ మహ్మద్‌లను మట్కా బుక్కీలుగా గుర్తించి అరెస్ట్‌ చేశారు. వారి వద్దకు డబ్బు తేవడానికి వచ్చిన ఉరవకొండ మండలం చోళసముద్రంకు చెందిన జన్నే లక్ష్మణ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

యువతిపై కేసు

బనశంకరి: బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులోని ఖైదీకి నిషేధిత వస్తువులను అందజేయడానికి యత్నించిన యువతి (27)ని అరెస్ట్‌ చేశారు. వివరాలు.. రితికా రై అనే యువతి 26 తేదీ సాయంత్రం 4 గంటలకు విచారణ ఖైదీ పర్హాన్‌ ఖాన్‌ను కలవాలని పాస్‌ తీసుకుని వెళ్లింది. ఆమెను తనిఖీ చేస్తున్న మహిళా పోలీసులకు అనుమానం వచ్చింది. క్షుణ్ణంగా పరిశీలించగా మహిళ శరీరంలో 3 పొగాకు ప్యాకెట్లు, 5జీ సిమ్‌కార్డులను దాచుకున్నట్లు తెలిసింది. వస్తువులను స్వాధీనం చేసుకుని ఆమెను స్థానిక పోలీసులకు అప్పగించారు. రితికా రై, ఫర్హాన్‌ ఖాన్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

జాతీయ పారా

తైక్వాండో పోటీలో ప్రతిభ

అనంతపురం: జాతీయ పారా తైక్వాండో పోటోల్లో అనంతపురం యువకుడు ప్రశాంత్‌ రెడ్డి ప్రతిభ చూపాడు. బెంగళూరులోని కోరమంగల ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన నేషనల్‌ చాంపియన్‌షిప్‌–2026లో ఏకంగా స్వర్ణ పతకం సాధించి, ఆసియా చాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యాడు. త్వరలో జరగనున్న ప్రతిష్టాత్మకమైన ఆసియా పారా తైక్వాండో చాంపియన్‌షిప్‌ పోటీల్లో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. అనంతపురంలోని ’చాంపియన్స్‌ తైక్వాండో అకాడమీ’ విద్యార్థి అయిన ప్రశాంత్‌రెడ్డి ఈ విజయంతో అంతర్జాతీయ స్థాయికి అర్హత సాధించాడు.

రామాంజినేయులు, జన్నే లక్ష్మణ్‌, నూర్‌మహ్మద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement