1న తుమకూరుకు రాష్ట్రపతి రాక | - | Sakshi
Sakshi News home page

1న తుమకూరుకు రాష్ట్రపతి రాక

Mar 31 2026 7:32 AM | Updated on Mar 31 2026 7:32 AM

తుమకూరు: ఏప్రిల్‌ 1వ తేదీన తుమకూరులోని సిద్ధగంగ మఠంలో జరుగనున్న త్రివిధ దాసోహి డా.శివకుమార స్వామి 119వ జయంతి, గురువందన మహోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. దీంతో ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. సోమవారం విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని హెలిప్యాడ్‌లో హెలికాప్టర్లతో రిహార్సల్‌ నిర్వహించారు. మరోవైపు వేలాది భక్తుల అన్నసంతర్పణ కోసం క్వింటాళ్ల కొద్దీ లడ్డు, మిఠాయిలు, కారా బూందీ తయారీ సాగుతోంది.

షుగర్‌ వ్యాధిగ్రస్తుల పాదాలు భద్రం

మంత్రి శరణప్రకాష్‌

బనశంకరి: మధుమేహ రోగుల్లో పాదాల సంరక్షణ పట్ల శ్రద్ధ వహించాలని, రానున్న రోజుల్లో తమ శాఖ ద్వారా మధుమేహ పరీక్షల సౌకర్యాన్ని కల్పిస్తామని వైద్య విద్యా శాఖ మంత్రి డాక్టర్‌ శరణ ప్రకాష్‌పాటిల్‌ తెలిపారు. ఈ అంశంపై కలబుర్గిలో జాతీయ అభియానను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. బెంగళూరులో ఉన్న కర్ణాటక ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎండోక్రైనాలజీ ఉత్తమంగా పనిచేస్తోందన్నారు. ఆదే తరహాలో కలబురిగి, మైసూరులోనూ అలాంటి వైద్య సంస్థలను ఏర్పాటు చేయాలనే యోచన ఉందన్నారు. చక్కెర రోగుల్లో పాదాల్లో సమస్యలను ప్రారంభ దశలోనే స్క్రీనింగ్‌ ద్వారా కనిపెట్టవచ్చని తెలిపారు. వైద్య నిపుణులు మాట్లాడుతూ ప్రపంచంలో ప్రతి 20 సెకెన్లకు ఒకరు చక్కెర రోగానికి బలి అవుతున్నారని చెప్పారు. ప్రతి 12 సెకెన్లకు ఒక షుగర్‌ కేసు నమోదవుతోందని చెప్పారు. భారతదేశంలో 10 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని తెలిపారు. దీనివల్ల పాదాల సమస్యలు వచ్చి ప్రతి ఏడాది 14 లక్షల మంది కాళ్లను తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చక్కెర వ్యాధిని మొదట్లోనే కనిపెట్టి వైద్యం తీసుకుంటే ఇబ్బంది ఉండదని తెలిపారు.

దంపతుల ఉసురుతీసిన లారీ

శివమొగ్గ: భద్రావతి తాలూకాలోని హెచ్‌కే జంక్షన్‌ సమీపంలో బైక్‌పై వెళ్తున్న దంపతులను లారీ ఢీకొని వారి మీద నుంచి దూసుకెళ్లడంతో దుర్మరణం చెందారు. మృతులను తరికెరె తాలూకావాసులు బాబు (30), భార్య సావిత్రి (27)గా గుర్తించారు. ఆదివారం రాత్రి జొన్నల లోడుతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లారీ శివమొగ్గ నుంచి తరికెరె మీదుగా వెళ్తోంది. బాబు దంపతులు ఒక హోటల్‌లో తమ పని ముగించుకుని తరికెరె మీదుగా తమ ఊరికి ఇంటికి వెళ్తున్నారు. ముందు వెళ్తున్న దంపతులను లారీ తాకడంతో కింద పడిపోగా వారి మీద నుంచి లారీ వెళ్లింది. కొన్ని క్షణాల వ్యవధిలో భార్యా భర్తలు చనిపోయారు. లారీ చక్రాల కింద బైక్‌ ఇరుక్కుపోయింది. భద్రావతి రూరల్‌ పోలీసులు లారీ డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement