సోమవారం ఉదయం శ్రీకంఠేశ్వర ఆలయం చుట్టూ జనసాగరం
రాత్రయినా అదే స్థాయిలో భక్తజనం
మైసూరు: దక్షిణ కాశీగా చరిత్ర ప్రసిద్ధి చెందిన మైసూరు జిల్లాలోని నంజనగూడులోని శ్రీకంఠేశ్వర (నంజుండేశ్వర) దేవస్థానం భక్తసాగరంతో కిక్కిరిసిపోయింది. సోమవారం లక్షలాది భక్తుల మధ్య గౌతమ పంచ మహారథోత్సవం వైభవోపేతంగా జరిగింది. ఉదయం ఆలయంలో విశేష పూజలు, యాగాదులు నిర్వహించారు. తర్వాత రథం వద్ద బలి పూజ నిర్వహించారు. శ్రీకంఠేశ్వరుని ఉత్సవ విగ్రహాన్ని నవరత్న కంఠహారంతో అలంకరించారు. ప్రధాన పూజారి జె. నాగచంద్ర దీక్షిత్ పలు పూజల తరువాత ఉత్సవమూర్తిని తేరులో ప్రతిష్ఠించారు. ఉదయం 6.35 గంటలకు ఎమ్మెల్యే దర్శన్ ధ్రువనారాయణ్, కలెక్టర్ జి.లక్ష్మీకాంతరెడ్డి టెంకాయ కొట్టి తేరు ఉత్సవానికి నాంది పలికారు. లక్షలాది భక్తులు తాడు పట్టుకుని తేరు లాగుతూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఆలయ వీధుల గుండా రథం కదిలింది. శ్రీ కంఠేశ్వర, పార్వతి, గణేశ, సుబ్రహ్మణ్య, చండికేశ్వర అనే 5 రథాలను భక్తులు లాగారు. సుమారు 97 అడుగుల ఎత్తు, 250 టన్నుల బరువున్న శ్రీకంఠేశ్వరుని తేరు కదలగానే భక్తుల హర్షధ్వానాలు మిన్నంటాయి. రాత్రి పొద్దుపోయేవరకూ భక్తులు రథోత్సవం చూడడానికి రావడంతో రద్దీ నెలకొంది.
నంజనగూడులో ఆధ్యాత్మిక వేడుక


