సిలిండర్ల లారీ పల్టీ | - | Sakshi
Sakshi News home page

సిలిండర్ల లారీ పల్టీ

Mar 31 2026 7:32 AM | Updated on Mar 31 2026 7:32 AM

దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో గ్యాస్‌ కొరత తీవ్రంగా ఉంది, సిలిండర్లు దొరకడం గగనమైన తరుణంలో గ్యాస్‌ సిలిండర్‌లు తరలిస్తున్న లారీ బోల్తాపడిన సంఘటన గదగ్‌ జిల్లా రోణ పట్టణ శివారులో జరిగింది. హుబ్లీ నుంచి రోణ, గజేంద్రగడ మీదుగా కుష్టగి పట్టణానికి భారత్‌ గ్యాస్‌ సిలిండర్లతో వెళ్తున్న లారీ రోణ శివార్లలో మలుపులో ఓవర్‌టేక్‌ చేయబోయి రోడ్డు పక్కకు బోల్తా కొట్టింది. దీంతో గ్యాస్‌ సిలిండర్‌లు రోడ్డు మీద చెల్లాచెదురుగా పడిపోయాయి. అదృష్టవశాత్తు అంతకుమించి జరగలేదు. ఎవరూ సిలిండర్లు ఎత్తుకుపోకుండా రోణ పోలీసులు బందోబస్తు కాశారు.

గ్యాస్‌ సిలిండర్ల చోరీ

బొమ్మనహళ్లి: ఆనేకల్‌ తాలూకాలోని సూర్య సిటీలో బి–కాంపొనెంట్‌లో సిలిండర్‌ దొంగతనాలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటలప్పుడు రెండు ఇళ్ల నుంచి మూడు సిలిండర్లు చోరీకి గురయ్యాయి. ఓ ఇంటివారు ఫుల్లు సిలిండర్‌ను తీసుకుని ఇంటి కిందిభాగంలో ఉంచారు. మరో రెండు ఇళ్లలోనూ సిలిండర్లు ఉన్నాయి. దీనిని కనిపెట్టిన దొంగలు వరుసగా సిలిండర్లను ఎత్తుకెళ్లారు. ఇద్దరు బైక్‌పై వచ్చారు, హెల్మెట్‌ ధరించిన ఓ వ్యక్తి వాటిని తీసుకెళ్లడం సీసీ కెమెరాలలో రికార్డయింది. గ్యాస్‌ కొరత వల్ల ఇలాంటి దొంగతనాలు పెరిగాయి. మేం సురక్షితంగా జీవించగలమా అనే ప్రశ్న తలెత్తుతోంది అని స్థానిక నివాసి పూర్ణేష్‌ రెడ్డి వాపోయారు.

కట్న వేధింపులకు

ఉద్యోగిని బలి

రాయచూరు రూరల్‌: భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయచూరులోని ఐబీ రోడ్డులో ఆదివారం రాత్రి జరిగింది. వివరాలు.. విద్య (30) అనే మహిళకు 2023 డిసెంబర్‌లో మంజునాథ్‌ ఉప్రాళమఠతో మూడు తులాల బంగారం, అర కేజీ వెండిని కానుకలుగా ఇచ్చి వివాహం జరిపించారు. ఆమె రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉప కేంద్రంలో అసిస్టెంట్‌ ప్రోగ్రాం అధికారిణిగా ఉద్యోగం చేసేది. భర్త మద్యం వ్యవసనంతో పాటు వరకట్న వేధింపులతో చిత్రహింసలకు గురి చేస్తుండేవాడు. పెద్దలు రాజీ చేసినా ఫలితం లేక పోయింది. ఆ బాధలు భరించలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి మృత్యుంజయస్వామి సదర్‌ బజార్‌ మహిళాళ పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశాడు.

పూమొగ్గ మింగి శిశువు మృతి

మైసూరు: జిల్లాలోని హుణసూరు తాలూకాలో చామంతి పువ్వు మొగ్గ ఆరున్నర నెలల పసికందు ప్రాణం తీసింది. వివరాలు.. దొడ్డ హెజ్జూర్‌లో సుదర్శన్‌, నవ్యల రెండవ కుమారుడైన చిన్మయ్‌ గౌడ మృతుడు. తండ్రి ఇంటి గడపకు పూజ చేసి పువ్వులను ఉంచాడు. పసివాడు చిన్మయ్‌ తన అన్నతో కలిసి ఆడుకుంటూ గడపపై ఉన్న చామంతి మొగ్గను మింగేశాడు. అది శ్వాసనాళంలో ఇరుక్కుపోయి బాలుడు ఊపిరి అందక అవస్థలు పడుతుండగా తల్లిదండ్రులు హనగోడ్‌లోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు, అక్కడి నుంచి మైసూరులోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే కొంతసేపటికే శిశువు మరణించడంతో తల్లిదండ్రులు శోకంలో మునిగిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement