విద్యుత్ భారమే కాకుండా బెంగళూరు ప్రజలకు మరో షాక్ తగలనుంది. ఏప్రిల్ 1 నుంచి నీటి చార్జీల వడ్డన కూడా తప్పేలా లేదు. నీటి బిల్లులో 3 శాతం మేర పెంపుదల ఉండవచ్చు. నీటి సరఫరా ఖర్చులతో పాటు నిర్వహణ వ్యయాలు పెరగడం, విద్యుత్, జీతభత్యాల వ్యయం ఎక్కువగా ఉందని జలమండలి చెబుతోంది. ఈ ఒత్తిడిని తట్టుకోవాలంటే కొళాయి బిల్లులను పెంచడమే శరణ్యమని ఉన్నతాధికారులు తెలిపారు. గత ఏడాది నీటి చార్జీలను ప్రతి ఏటా 3 శాతం మేర పెంచేందుకు ప్రభుత్వం ఆమోదించింది. ఆ ప్రకారం ఏప్రిల్ నుంచి ఈ పెంపు ఉంటుదని బెంగళూరు జలమండలి అధ్యక్షుడు రామ్‌ప్రసాద్ మనోహర్ తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి విద్యుత్, నీటి చార్జీలు పెంపుదల అమలైతే ప్రజలపై ఆకస్మికంగా భారం పడనుంది. పంచ గ్యారెంటీ పథకాల ద్వారా ఖాళీ అయ్యే ఖజానాను నింపుకునేందుకు సిద్దు సర్కారు ఈ ధరలను పెంచుతోందనే ఆరోపణలు ఉన్నాయి.


