కృష్ణరాజపురం: బెంగళూరులో ఇళ్లలో బాడుగకు ఉండేవారు లక్షలాది రూపాయలను అడ్వాన్సుగా ఇచ్చుకుని, వేలాది రూపాయలను ప్రతి నెలా అద్దె చెల్లించాలి, అంతే కాదు.. ఇంటి యజమాని దౌర్జన్యం చేస్తే చేయించుకోవాలి... ఇలా ఉంది కొన్నిచోట్ల దుస్థితి. ఇంటి యజమాని కుటుంబం దాడి చేయడంతో అద్దెకున్నవారు గాయాల పాలయ్యారు. ఈ సంఘటన మార్చి 29న బెంగళూరులోని కోడిహళ్లి, జీవన్ బీమా నగరలో జరిగింది.
ఇంటి యజమాని శోభ, దేవరాజ్ వారి పిల్లలు అద్దెకున్నవారి పైన దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. నరేష్ అతని సోదరుడు సచిన్, సోదరి రేఖ ఈ ఇంట్లో బాడుగకు ఉంటున్నారు. అది కూడా వారం క్రితమే చేరారు. గ్యాస్ రేటు పెరిగిందని, నీటి బిల్లు కూడా ఎక్కువ చెల్లించాలని, లేకపోతే ఇల్లు ఖాళీ చేయాలని ఇంటి యజమాని వారిని ఒత్తిడి చేశారు. దీని మీద గొడవ జరిగింది. యజమాని కుటుంబీకులు నరేష్ సచిన్, రేఖలను కొట్టారు. వారి మీద బకెట్లతో నీళ్లు చల్లి అల్లరి చేశారు. కత్తి, బ్లేడ్లతో కోయడంతో నరేష్‌కు రక్త గాయాలు అయ్యాయి. బాధితులు జీవన్ బీమా నగర ఠాణాలో ఫిర్యాదు చేశారు.


