హుబ్లీ: పశ్చిమాసియాలో యుద్ధం పర్యవసానంగా అంతటా వంటగ్యాస్ సమస్య తలెత్తి ఆర్థిక సమస్యలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూలన పడవేసిన బయోగ్యాస్ వినియోగంపై పలువురు వ్యాపారులు ఆసక్తి చూపి తిరిగి దాని పునరారంభానికి నడుం కట్టారు. వంటగ్యాస్ సమస్య తలెత్తడంతో హావేరి రాజేంద్ర నగర్ నివాసి శ్రీనివాస్ గతంలో మూలన పడవేసిన బయోగ్యాస్ ప్లాంట్ ద్వారా గ్యాస్ వినియోగానికి తిరిగి పాత విధానానికి శ్రీకారం చుట్టారు. గత నాలుగేళ్ల నుంచి ఈ యూనిట్‌ను బంద్ చేశారు.
బయోగ్యాస్ యూనిట్ ప్రారంభానికి ఏర్పాట్లు
తన ఇంటి ముందు బయోగ్యాస్ యూనిట్ ప్రారంభానికి ఏర్పాట్లు చేసుకున్నారు. పేడ, వ్యవసాయ వ్యర్థాలు, తడి చెత్త, సేంద్రియ వస్తువులను బయోగ్యాస్ ప్లాంట్‌లో ఆమ్లజనక రహిత స్థితిలో మరిగించడం ద్వారా ఈ గ్యాస్ ఇంధనంగా మారుతుంది. ఎల్‌పీజీ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలియని అయోమయంలో బయోగ్యాస్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. శ్రీనివాస్ మాట్లాడుతూ నేను, నా భార్య, పిల్లలకు ఈ గ్యాస్ సరిపోతుందన్నారు. నాలుగేళ్ల క్రితం రూ.15 వేలు ఖర్చు పెట్టి ఈ ప్లాంట్ నిర్మించుకున్నాను. తొలుత 15 గంపల పేడ వేయగా రోజు తమ వంటింటిలో మిగిలిన కాయకూరలు, ఆకుకూరలు ఇతర పదార్థాలను కొద్దిగా నీటిలో కలిపి వేస్తే చాలు ఇంధనం సిద్ధమవుతుందన్నారు.
పశువుల పేడతో బయోగ్యాస్ ఉత్పత్తి
గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తాము పెంచిన పశువుల పేడతో బయోగ్యాస్ ఉత్పత్తి చేసి వంటావార్పుకు వినియోగించుకొనే వారు. ప్రారంభంలో అవిభక్త కుటుంబాలు ఉండటం వల్ల పశుపక్ష్యాదులు సైతం ఎక్కువగా ఉండేవి. పెరట్లో భారీ బావి ఆకారంతో బయోగ్యాస్ యూనిట్ నిర్మించే వారు. ప్రతి రోజు పశువులు వేసే పేడను సేకరించి దానిలో చెత్తచెదారం లేకుండా బావిలో వేస్తే చాలు గ్యాస్ సిద్ధమయ్యేదన్నారు. మొత్తానికి పాత బయోగ్యాస్ వాడకం విధానమే మంచిదని రైతు శ్రీనివాస్ కుటుంబం అభిప్రాయ పడింది.
పాత విధానం పునరారంభానికి శ్రీకారం
వినియోగంలోకి మూలన పడిన ప్లాంట్


