రాయచూరు రూరల్: జిల్లాలో పేదలకు పంచాల్సిన చౌక బియ్యం పక్క జిల్లాకు అక్రమంగా తరలిస్తుండగా 35 టన్నుల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన గంగావతిలో జరిగింది. ఆహార పౌర సరఫరాల శాఖాధికారి శేఖరప్ప ఫిర్యాదు మేరకు ఈ దాడులు నిర్వహించారు. కొప్పళ జిల్లా కుకనూరు నుంచి గంగావతి, మాన్విలోని బియ్యం మిల్లులకు అక్రమంగా తరలిస్తున్న వాహనంలోని సుమారు రూ.10 లక్షలు విలువ చేసే బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై మాన్వికి చెందిన వీరభద్రప్ప ఆల్దాళ, బసనగౌడ ఆల్దాళ, రాయచూరు వెంకటరెడ్డి, కుకనూరు యమనూరప్పలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
గ్రామీణ పోలీసుల దాడుల్లో..
బళ్లారిఅర్బన్: బళ్లారి గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం నిల్వలపై పోలీసులు దాడులు నిర్వహించి మొత్తం 123 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొదటి ఘటనలో ఎన్‌పీఆర్ లేఅవుట్ సమీపంలోని గుట్ట అంచున ఉన్న ఓ బహిరంగ ప్రదేశంలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు రూ.93,840 విలువ చేసే 40.80 క్వింటాళ్ల రేషన్ బియ్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో గుగ్గరహట్టికి చెందిన శరభయ్య అనే వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మరొక ఘటనలో ఆహార, పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించారు. కొళగల్లు– సిరుగుప్ప రహదారి మధ్యలో ఉన్న ఓ లేఅవుట్‌లో నిల్వ ఉంచిన సుమారు రూ.1,90,440 విలువ చేసే 82.80 క్వింటాళ్ల రేషన్ బియ్యంను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.


