హుబ్లీ: వివిధ కారణాలతో యువతులు అదృశ్యమవుతున్న కేసులు జిల్లా వ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. కళాశాలకు, పరీక్షలకు, ఆలయాలకు, పర్యటనకు కుట్టుమిషన్ శిక్షణ, మెడికల్ షాపుకు, స్నేహితుల ఇంటికి, బట్టలు కుట్టించేందుకు సంఘంలో డబ్బులు కట్టడానికి, పాలు తీసుకురావడానికి ఇలా వివిధ కారణాలు చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతులు కనిపించకుండా పోతున్నారు. మరి కొందరెమో ఇంట్లో ఎవరు లేని సమయంలో, రాత్రి పూట అందరూ నిద్రించాక వెళ్లిపోతున్నట్లు వెల్లడైంది. ఇలా వెళ్లిన వారిలో 18 నుంచి 23 ఏళ్ల వయస్సు లోపు ఉన్న యువతులు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఈ కేసులు నిగ్గుతేల్చడానికి ప్రయత్నించిన పోలీసులకు ఎక్కువగా తెలిసిన విషయం ఏమిటంటే ప్రేమ వివాహాలే. 2025 అక్టోబర్ నుంచి గత ఫిబ్రవరి వరకు ఇలాంటి 65 కేసులను పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఫిబ్రవరి 15 వరకు వివిధ పోలీస్టేషన్లలో ఇలాంటి కేసులు 25 నమోదు కాగా... వీటిలో 14 మందిని పట్టుకున్నారు. ఇంటి పని, అలాగే చదువు గురించి పోషకుల వేధింపులతో పాటు కౌటింబిక దౌర్జన్యానికి కొందరు యువతులు ఇంటిని విడిచి వెళ్లిపోతున్నారు. ప్రేమ విషయం తెలిస్తే కుటుంబ సభ్యులు హింసించడం, బలవంతంగా పెళ్లిళ్లు నిర్ణయించడం వంటి కారణాల వల్ల యువతులు అదృశ్యమవుతున్నట్లు దర్యాప్తులో తేలిందని నగర ఏసీపీ శివానంద తెలిపారు. కొన్నేళ్ల వివరాలను పరిశీలిస్తే.. 2023లో 239 కేసులకు గాను 234 పరిష్కరించగా.. 5 కేసులు దర్యాప్తు దశలో ఉన్నాయి. 2024లో 250 కేసులకు గాను 243 పరిష్కరించారు. 7 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2025లో 180 కేసులకు గాను 169 పరిష్కరించగా 11 దర్యాప్తు దశలోనే ఉన్నాయి. తాజాగా ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి వివరాలు పరిశీలిస్తే.. 25 కేసులు నమోదు కాగా వాటిలో 14 కేసులను పరిష్కరించగా 11 ఇంకా దర్యాప్తు దశలోనే ఉన్నాయి.


