రాయచూరు రూరల్: యాదగిరి జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పొలంలో తవ్విన నీటి కుంటలో మునిగి నలుగురు పిల్లలు మృతి చెందారు. ఈ ఘటన యాదగిరి జిల్లా షోరాపూర్ తాలూకాలోని నాగానూర్‌లో చోటుచేసుకుంది. ప్రాథమిక నివేదికల ప్రకారం పిల్లలందరూ ఈతకు వెళ్లి, చెరువు లోతు తెలియక ఒకరి తర్వాత ఒకరు మునిగిపోయారు. యాదగిరి జిల్లా షోరాపూర్ తాలూకాలోని నాగానూర్ గ్రామానికి చెందిన పిల్లలు ఆదివారం సెలవు కావడంతో ఈత కొట్టేందుకు ఒక వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కృషి హోండా (నీటి కుంట) వద్దకు వెళ్లారు. సరదాగా ఈత కొట్టేందుకు ఒక్కొక్కరుగా దిగారు. లోతు ఎక్కువ ఉండటంతో అందరూ నీటిలో మునిగిపోయారు. కిరణ్ (6), బసమ్మ (11) శరత్ (6) హనుమేష్ (7) మృతులు. పిల్లలు కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. నీటి కుంట వద్దకు వెళ్లినట్లు తెలుసుకుని పరిశీలించారు. కుంటలోకి దిగి గాలించగా.. నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను బయటకు తీయడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయ్యో.. దేవుడా ఎంత ఘోరం జరిగిందని కంటతడి పెట్టుకున్న తీరు అక్కడున్న వారిని కలచివేసింది. ఒకే గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. షోరాపూర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జావీద్ ఇనామ్‌దార్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. కెంబావి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మృతి చెందిన చిన్నారులు
రోదిస్తున్న బాధిత కుటుంబ సభ్యులు
యాదగిరి జిల్లాలో విషాదం
ఈతకెళ్లి నలుగురు చిన్నారులు మృత్యువాత
కన్నీరుమున్నీరుగా విలపించిన కుటుంబ సభ్యులు


