భల్లూకం బీభత్సం | - | Sakshi
Sakshi News home page

భల్లూకం బీభత్సం

Mar 30 2026 8:48 AM | Updated on Mar 30 2026 8:48 AM

దొడ్డబళ్లాపురం: రామనగర జిల్లా చన్నపట్టణ తాలూకా సింగరాజపుర–కోడంబళ్లి గ్రామాల రహదారిపై భల్లూకం బీభత్సం సృష్టించింది. అడవిలో నుంచి వచ్చి, బైకిస్టులపై దాడిచేసి గాయపరచింది. మారమ్మగుడి వద్ద రోడ్డుపైకి వచ్చిన ఎలుగుబంటి అటుగా వెళ్తున్న బైకిస్టులపై దాడి చేసింది. బైకిస్టులు ఎలాగో తప్పించుకోగా, ఓ టెంపోను అడ్డుకుని దాడికి ప్రయత్నించింది. ఎలుగుబంటిని చూసిన వాహనదారులు తమ వాహనాలను వదిలి పరారయ్యారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. అటవీశాఖ అధికారులు గాలించి ఎలుగుబంటిని ఎట్టకేలకు బోనులో బంధించారు. ఎలుగుబంటి తిరగబడి అటవీశాఖ అధికారి ముత్తునాయక్‌, స్థానికుడు దొడ్డయ్యలను గాయపరిచింది. దానిని దూరంగా తరలించారు.

రూ.1.28 కోట్ల సైబర్‌ దోపిడీ

యశవంతపుర: మోసపోయేవారున్నంత కాలం మోసగించేవారు ఉంటారు. అమాయకత్వంతో చెప్పినట్టల్లా చేసి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. ఫేస్‌బుక్‌లో వచ్చిన ప్రకటనను నమ్మి వ్యక్తి ఒకరు రూ.1.28 కోట్లు పోగొట్టుకున్న ఘటన చిక్కమగళూరులో వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.. జిల్లాలోని కడూరు తాలూకా శివపుర గ్రామానికి చెందిన కల్లేగౌడకు ఫేస్‌బుక్‌లో ఓ ప్రకటన కనిపించింది. తమ ద్వారా ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని అందులో ఉంది. నమ్మిన కల్లేగౌడ అందులోని నంబరుకు కాల్‌ చేసి మాట్లాడాడు. అతని ద్వారా పెట్టుబడుల పేరుతో రూ.1.28 కోట్లు వసూలు చేశారు. ఎన్నిరోజులైనా రూపాయి కూడా తిరిగి రాలేదు. కల్లేగౌడ డబ్బులను విత్‌ డ్రా చేయబోగా, యాప్‌ పనిచేయలేదు. దీంతో అతడు సీఈన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వీధి కుక్కల దత్తత

బనశంకరి: బెంగళూరు దక్షిణ నగర పాలికె ఆధ్వర్యంలో జయనగర శాలిని మైదానంలో వీధి శునకాల కూనల దత్తత శిబిరం జరిగింది. పాలికె అధికారులు పాల్గొని కూనలను పలువురికి అప్పగించారు. వీధి కుక్కల సంఖ్యను క్రమేణా తగ్గించడం, మానవతా విధానాల ద్వారా కుక్కల సమస్యను పరిష్కరించడం తమ లక్ష్యమన్నారు.

చిందులేసిన రౌడీల ఆటకట్టు

దొడ్డబళ్లాపురం: బెంగళూరులో ఫేమస్‌ అయిన అణ్ణమ్మ పాటకు కత్తులు బట్టి డ్యాన్స్‌ చేసిన ఇద్దరు రౌడీషీటర్లను బ్యాటరాయనపుర పోలీసులు అరెస్టు చేశారు. నందీష్‌, రంజిత్‌లు కొన్ని రోజుల క్రితం రాత్రివేళ రోడ్డు మీద కత్తులు పట్టుకుని ఈ పాటకు చిందులేశారు. వారిని చూసి ప్రజలు భయభ్రాంతులయ్యారు. ఈ వీడియో వ్యాప్తి చెందగా పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరినీ అరెస్టు చేశారు. వీరిపై బెంగళూరులో పలు పోలీస్‌స్టేషన్‌లలో అనేక కేసులు నమోదై ఉన్నాయి.

దావణగెరెలో గెలుపు

మాదే: విజయేంద్ర

శివాజీనగర: దావణగెరె దక్షిణ నియోజకవర్గ ఓటర్లు మార్పును కోరుకొంటున్నారని, ప్రతిసారి కాంగ్రెస్‌ను గెలిపించినా ఎలాంటి అభివృద్ధి పనులు జరుగలేదు. ఈసారి మార్పు రావాలని, ధన బలం, భుజబలాన్ని లెక్కించకుండా బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తారని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర అన్నారు. బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్‌ దాస కరియప్ప తరఫున ఆయన ప్రచారం చేశారు. చేనేతకారుల సముదాయ భవన్‌లో చేనేతకారులతో సభ జరిపారు. కరియప్పను గెలిపిస్తే అన్ని వర్గాలకు న్యాయం లభిస్తుందన్నారు. ఈసారి గెలుపు తథ్యమని అన్నారు. సీఎం సిద్దరామయ్య 17 బడ్జెట్‌లను ప్రవేశపెట్టినా రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించారు. 5 రాష్ట్రాల ఎన్నికల తరువాత కాంగ్రెస్‌ హైకమాండ్‌ చెప్పినట్లు సిద్దరామయ్య వినాలన్నారు.

బెంగళూరులో విక్టరీ వెంకటేష్‌

బనశంకరి: ప్రముఖ తెలుగు నటుడు విక్టరీ వెంకటేశ్‌ బెంగళూరు బసవనగుడిలో ప్రముఖ హోటల్‌ విద్యార్థి భవన్‌లో మసాలా దోసె రుచిచూశారు. ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు బెంగళూరుకు వచ్చిన ఆయన విద్యార్థి భవన్‌ హోటల్‌ను సందర్శించారు. మసాలా దోసెను ఆరగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement