బనశంకరి: బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అనేది రాష్ట్ర జైళ్ల శాఖకే పెద్ద తలనొప్పిగా మారింది. ఇక్కడ జరుగుతున్న అక్రమాలు ఉన్నతాధికారులకు సవాల్ విసురుతున్నాయి. ఈ జైలులో మొబైల్, టీవీ, నెట్‌ఫ్లిక్స్ సౌలభ్యాలు ఉన్నాయని, అంతకంటే ఇంకేం కావాలంటూ ఖైదీలు వీడియో తీసి వైరల్ చేశారు. జైళ్ల అధికారుల సహకారం కూడా ఇందుకు ఉందని తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్ ఉంది, ఈసారి కప్ మనదే, జైల్లో అన్ని సౌకర్యాలూ ఉన్నాయి అని ఆ వీడియోలో ఖైదీలు చెప్పారు.
ముగ్గురు వార్డర్ల సస్పెండ్
వీడియో వైరల్ కాగానే జైలు అధికారులు ప్రతి బ్యారక్‌లో తనిఖీలు చేపట్టారు. ప్లాస్టిక్ కవర్ చుట్టి బాత్‌రూమ్ నీటిపైపులో దాచిపెట్టిన కొన్ని మొబైల్స్ లభించాయి. నిర్లక్ష్యం వహించారంటూ జైళ్ల శాఖ డీజీపీ అలోక్‌కుమార్ ముగ్గురు వార్డర్లను సస్పెండ్ చేశారు. సదరు ఖైదీల బ్యారక్ వద్ద పనిచేసే శివానంద కర్లబట్టి, నిరంజన్ ఏ.కామత్, హనుమంతప్ప హడపద పై వేటేశారు. అయితే ఆ వీడియోను నిజంగా జైలులోనే తీశారా? అనేది విచారణ చేపట్టారు.
అలోక్‌కుమార్ పేరు
తమకు ఈ సౌకర్యాలను జైళ్ల శాఖ డీజీపీ అలోక్‌కుమార్ కల్పించారని ఖైదీలు చెప్పడం పెద్ద చర్చనీయాంశమైంది. దర్శన్, అభి, ఎండ్రోస్ అనే ముగ్గురు ఖైదీలు ఈ వీడియోలో ఉన్నారు. హెణ్ణూరు బండె వద్ద జరిగిన హత్యలో దర్శన్, అబి నిందితులు. వీడియో నేపథ్యంలో ముగ్గురిపైనా పరప్పన అగ్రహార పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వారిని క్వారంటైన్ సెల్‌కు మార్చారు. అలోక్‌కుమార్‌కు చెడ్డ పేరు తేవాలని ఈ వీడియోను చేశారని అనుమానాలున్నాయి. ఆయన జైళ్ల శాఖ చీఫ్ అయ్యాక పరప్పనపై ప్రత్యేక దృష్టి పెట్టి అక్రమాలకు చెక్‌పెట్టారు.
మొబైల్స్, టీవీ, నెట్‌ఫ్లిక్స్ అన్నీ ఉన్నాయి
ముగ్గురు నిందితుల వీడియో వైరల్
జైళ్ల శాఖ చీఫ్‌పైనే ఆరోపణలు


